
దేశంలో అన్నిరంగాల్లో పరివర్తన వస్తేనే గుణాత్మక మార్పు సాధ్యమవుతుందని, ఆ మార్పు తీసుకురావడానికి మాజీ సైనికులు దేశానికి సేవ చేయాల్సిన సమయం ఆసన్నమైందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. దేశాన్ని కాపాడేందుకు ఇన్నాళ్ళు దేశ సరిహద్దుల్లో పనిచేసిన మాజీ సైనికులు .. నేడు బీఆర్ఎస్ వేదికగా కిసాన్‌తో జత కట్టారనీ, జై జవాన్, జై కిసాన్ నినాదానికి సంపూర్ణ అర్థాన్నిచ్చే దిశగా ఐక్యత చాటారని అన్నారు. మహారాష్ట్రకు చెందిన మాజీ సైనిక సంఘాల నేతలు, మాజీ సైనికులు కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు. వారికి గులాబీ కండువాలు కప్పి భారత రాష్ట్ర సమితిలోకి స్వాగతం పలికారు సీఎం కేసీఆర్.
ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. భారతదేశంలో అన్నిరంగాల్లో పరివర్తన వస్తేనే గుణాత్మక మార్పు సాధ్యమవుతుందని పునరుద్ఘాటించారు. సంక్షేమం, అభివృద్ధి, అభ్యున్నతితో కూడిన నూతన శకానికి నాంది పలికేందుకు పాలనలో సమూల మార్పు రావాలని పిలుపునిచ్చారు. 'అబ్‌కీ బార్ కిసాన్ సర్కార్' అనే బిఆర్‌ఎస్ నినాదానికి ప్రతిస్పందిస్తూ దేశ సైనికులు ముందుకు రావడం సంతోషదాయకమని, జీవితాల్లో గుణాత్మక మార్పును సాధించేందుకు మాజీ సైనికులు తమ కర్తవ్యాన్ని కొనసాగించాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు. విశ్రాంత సైనికులు పెద్దఎత్తున పార్టీలో చేరడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. 'అబ్ కీ బార్ కిసాన్ సర్కార్' నినాదంతో మహారాష్ట్రలోకి అడుగుపెట్టిన BRS కిసాన్ ల పక్షన నిలుస్తోందని అన్నారు.
నాసిక్ జిల్లాకు చెందిన 'ఫౌజీ జనతా పార్టీ' కార్యదర్శి, ప్రముఖ మాజీ సైనికుడు సునీల్ బాపురావు పగారే ఆదివారం చేరిన వారిలో ఉన్నారు. మాలేగావ్‌కు చెందిన ప్రవీణ్ ఆనంద్ థోక్, నాసిక్ నుండి సాగర్ మాగ్రే, పూణే నుండి తుకారాం దఫాద్, షోలాపూర్ నుండి సునీల్ అంధరే, షిరూర్ నుండి బాబన్ పవార్ మరియు దోండ్ నుండి సందీప్ లగాడ్ తదితరులు ఈ సందర్భంగా చేరారు.
పార్టీలో చేరిన రిటైర్డ్ డిఫెన్స్ సిబ్బందిలో మహారాష్ట్రలోని వివిధ జిల్లాల నుండి మాజీ సైనికుల సంఘాలకు చెందిన పలువురు ఆఫీస్ బేరర్లు కాకుండా కొంతమంది కల్నల్ శ్రేణులు ఉన్నారు, వారు పరిపాలనలో గుణాత్మక మార్పును సాధించడంలో సహాయపడటానికి పార్టీ నాయకత్వానికి అన్ని విధాలా మద్దతు ఇస్తారని హామీ ఇచ్చారు. ఈ క్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యే బాల్క సుమన్, మాజీ మంత్రి సముద్రాల వేణుగోపాలాచారి, బీఆర్‌ఎస్ నాయకులు శంకరన్న ధొంగే తదితరులు పాల్గొన్నారు.