ఎంపీపి కొడుకు పేరు కేటీఆర్... స్వయంగా నామకరణం చేసిన సీఎం కేసీఆర్ (వీడియో)

By Arun Kumar PFirst Published Aug 27, 2021, 4:58 PM IST
Highlights

కరీంనగర్ జిల్లాకు చెందిన టీఆర్ఎస్ మహిళా ఎంపిపి కుమారుడికి కలిగేటి తారకమరణ(కేటీఆర్)గా నామకరణం చేశారు సీఎం కేసీఆర్. 

కరీంనగర్ జిల్లా రామడుగు ఎంపిపి కలిగేటి కవిత-లక్ష్మణ్ దంపతుల కుమారుడికి కలిగేటి తారకమరణ(కేటీఆర్) అని నామకరణం చేశారు సీఎం కేసీఆర్. బాబును స్వయంగా ఎత్తుకుని కాస్సేపు ముద్దుచేసిన సీఎం పేరు పెట్టారు. అయితే సీఎం ఉద్దేశ్యపూర్వకంగా పెట్టారో లేక అలా కుదిరిందో తెలీదు కానీ కేటీఆర్ అన్న పేరు ఆ బాలుడికి ఫిక్స్ అయ్యింది.  

కరీంనగర్‌ కలెక్టరేట్‌లో దళితబంధు పథకంపై సీఎం కేసీఆ అద్యక్షతన సమీక్షా సమావేశం జరిగింది. ఈ క్రమంలోనే ఎంపీపి కవిత దంపతులు తమ పిల్లాడితో ముఖ్యమంత్రిని కలిశారు. తమ బిడ్డకు మీరే నామకరణం చేయాలని దంపతులు కోరగా తారకరమణ పేరు బావుంటుందని సీఎం సూచించారు. దీంతో కలిగేటి తారకరమణ పేరును తమ బిడ్డకు పెడుతున్నట్లు తల్లిదండ్రులు తెలిపారు. 

మోతె గ్రామం నుండి టిఆర్ఎస్ పార్టీ టికెట్ పై ఎంపీటీసీగా గెలుపొందడమే అదృష్టంగా భావించామని... అయితే అన్నీ కలిసివచ్చి ఎంపీపీ గా అవకాశం వచ్చిందన్నారు. తమకు రాజకీయ జీవితాన్ని ప్రసాదించిన టిఆర్ఎస్ పార్టీపై, అధినేత కేసీఆర్ పై అభిమానంతో కుమారుడి పేరు కేటీఆర్ గా పెట్టుకున్నామని ఎంపీపీ దంపతులు తెలిపారు.  

గతంలో కుటుంబ కలహాలతో విడాకులు తీసుకునేందుకు సిద్ధమయ్యారు కవిత, లక్ష్మణ్ దంపతులు. విడాకుల కోసం కోర్టుకు కూడా వెళ్ళారు. అయితే ఇదే సమయంలో వీరికి ఎంపీటీసీ టికెట్ ఖాయం కావడంతో భార్యాభర్తలు కలిసి ఉండేలా అప్పట్లో కౌన్సెలింగ్ నిర్వహించారు స్థానిక టిఆర్ఎస్ నాయకులు. వీరి మాటలపై గౌరవంతో కలిసిపోయి ఎంపిటీసిగా గెలిచారు. రిజర్వేషన్ కలిసిరావడంతో ప్రస్తుతం రామడుగు ఎంపిపిగా కొనసాగుతున్నారు కవిత.  

ఇలా ఎంపిటిసి ఎన్నికల తర్వాత కూడా కలిసే ఉంటున్న దంపతులకు ఇటీవలే బాబు జన్మించాడు. ఆ బాబును ఇవాళ సీఎం కేసీఆర్ వద్దకు తీసుకుని వెళ్లగా స్వయంగా ఆయనే నామకరణం చేశారు. తమ కొడుకు కూడా కేటీఆర్ అంత గొప్పవ్యక్తి కావాలని కోరుకుంటున్నట్లు ఎంపీపి కవిత దంపతులు తెలిపారు. 

click me!