Telangana: "మన ఊరు మన బడి" ప్రారంభించిన‌ సీఎం కేసీఆర్

Published : Mar 08, 2022, 04:50 PM IST
Telangana: "మన ఊరు మన బడి" ప్రారంభించిన‌ సీఎం కేసీఆర్

సారాంశం

Telangana: తెలంగాణ ముఖ్య‌మంత్రి సీఎం కేసీఆర్  "మన ఊరు మన బడి" కార్యక్రమాన్ని మంగ‌ళ‌వారం నాడు ప్రారంభించారు. ప్ర‌భుత్వ బ‌డుల ప్ర‌గ‌తి కోసం అన్ని ర‌కాల చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని ఈ సంద‌ర్భంగా వెల్ల‌డించారు.  

Telangana: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని వసతులు కల్పిస్తామని, పాఠశాలల్లో ఏర్పాటు చేస్తున్న సౌకర్యాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పిలుపునిచ్చారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం బోధనను ప్రవేశపెడతామని మంగళవారం వ‌న‌ప‌ర్తిలోని ZP హైస్కూల్ (బాలుర)లో మన ఊరు మన బడి కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించిన అనంతరం ముఖ్యమంత్రి తెలిపారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన పైలాన్‌ను ఆయ‌న‌ ఆవిష్కరించారు.

అక్క‌డ ఏర్పాటు చేసిన కార్య‌క్ర‌మంలో తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ మాట్లాడుతూ.. "ఉపాధ్యాయులు అందించిన విద్య వల్లే మేమంతా ప్రభుత్వ పాఠశాలల్లో చదివి ఆయా రంగాల్లో రాణించామని అన్నారు. పాఠశాలల్లో కల్పిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకొని మంచి విజయం సాధించండి" అని విద్యార్థులను ఉద్దేశించి సీఎం కేసీఆర్ అన్నారు. మన ఊరు మన బడి కార్యక్రమం కింద రాష్ట్ర ప్రభుత్వం మూడు దశల్లో రూ.7,289.54 కోట్లతో రాష్ట్రవ్యాప్తంగా 26,000 ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేయనుంద‌ని తెలిపారు. మొదటి దశలో 9,123 పాఠశాలల్లో 12 రకాల సౌకర్యాలు కల్పించి అభివృద్ధి చేస్తామ‌ని పేర్కొన్నారు. రూ.3,497.62 కోట్లతో ఈ పనులు చేపట్టి జూన్‌ నాటికి పూర్తి చేయాలని విద్యాశాఖ లక్ష్యంగా పెట్టుకుంది.

అంతకుముందు చిట్యాలలో నూతన వ్యవసాయ మార్కెట్‌ యార్డును ముఖ్యమంత్రి ప్రారంభించారు. ప్రస్తుత మార్కెట్‌ యార్డులో స్థలం సరిపోకపోవడంతో రైతులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నందున చిట్యాలలో 40 ఎకరాల విస్తీర్ణంలో కొత్త మార్కెట్‌ యార్డును నిర్మించారు. రూ.44.5 కోట్ల వ్యయంతో దీన్ని నిర్మించారు. అనంతరం నాగవరంలో టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట వ్యవసాయ శాఖ మంత్రి ఎస్‌ నిరంజన్‌రెడ్డి, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, పర్యాటక శాఖ మంత్రి వి శ్రీనివాస్‌గౌడ్‌, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

అలాగే, వనపర్తి జిల్లాలో నూతనంగా నిర్మించిన సమీకృత జిల్లా కలెక్టరేట్‌ సముదాయాన్ని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు మంగళవారం ప్రారంభించారు. నూతనంగా ప్రారంభించిన కాంప్లెక్స్‌లో  ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ తలసరి విద్యుత్ వినియోగం, వ్యక్తుల తలసరి ఆదాయంతో పాటు అన్ని రంగాల్లో తెలంగాణ ప్రథమ స్థానంలో ఉందన్నారు. రాష్ట్ర ప్రగతికి కోసం అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. మరిన్ని సంక్షేమ పథకాలు తీసుకువస్తామన్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

KCR Press Meet from Telangana Bhavan: చాలా రోజుల తర్వాత మీడియా ముందుకు కేసీఆర్‌| Asianet News Telugu
KCR Press Meet from Telangana Bhavan: తెలంగాణ భవన్ కుచేరుకున్న కేసీఆర్‌ | Asianet News Telugu