
73వ గణతంత్ర దినోత్సవం (Republic Day) సందర్భంగా తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR) శుభాకాంక్షలు తెలిపారు. భారత రాజ్యాంగం ప్రకారం వివిధ సభలకు తమ ప్రతినిధులను ఎన్నుకోవడం వల్ల దేశంలో పౌరులే పాలకులని సీఎం కేసీఆర్ అన్నారు. భారతదేశం రాష్ట్రాల యూనియన్ అని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్బావం నుంచి సమాఖ్య స్పూర్తిని ప్రదర్శిస్తోందని చెప్పారు. సమాఖ్య స్పూర్తిని మరింత దృఢంగా కొనసాగిస్తామని తెలిపారు.రాజ్యాంగ స్పూర్తిని కొనసాగించేందుకు ప్రతినబూనుదాం అన్నారు.
భారతదేశం రాష్ట్రాల యూనియన్ అని.. దేశాన్ని తయారు చేసేది రాష్ట్రాలేనని సీఎం కేసీఆర్ తెలిపారు. రాష్ట్రాల హక్కులను పరిరక్షించడం ద్వారా.. భారతదేశం యొక్క శక్తివంతమైన ప్రజాస్వామ్యం ప్రపంచానికి రోల్ మోడల్‌గా మారుతుందని సీఎం చెప్పారు. రాజ్యాంగంలో పొందుపరిచిన సమాఖ్య స్ఫూర్తికి తమను తాము పునరంకితం చేసుకోవాలని.. అంకితభావంతో, నిబద్ధతతో దాని విలువలను కొనసాగించాలని భారత పౌరులను కేసీఆర్ కోరారు.
‘ప్రజలే స్వయం పాలకులై తమ ప్రభుత్వాలను నిర్దేశించుకునే సర్వసత్తాక సార్వభౌమాధికారం భారత దేశ ప్రధాన లక్షణం. భిన్న సంస్కృతులు, విభిన్న సాంప్రదాయాలు, విలక్షణమైన సామాజిక భిన్నత్వంతో కూడిన ఏకత్వాన్ని ప్రదర్శిచడమే.. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామిక దేశమైన భారత దేశం యెక్క గొప్పతనం. భిన్నత్వంలో ఏకత్వం.. భారత పౌరుల విశ్వమానవ తత్వానికి, సామాజిక, రాజకీయ, సాంస్కృతిక, ప్రాపంచిక దృక్పధానికి ప్రతీకగా నిలుస్తుంది. పరిపాలనా వికేంద్రీకరణ ద్వారా దేశ ప్రజాస్వామిక పునాదులను మరింతగా పటిష్టపరిచేందుకు రాజ్యాంగంలో రాష్ట్రాలను పొందుపరిచారు. మన దేశ ముఖచిత్రానికి రాష్ట్రాలు ప్రతిబింబాలుగా నిలిచాయి’ అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.
ఇక, ఈ రోజు ఉదయం 10 గంటలకు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో యుద్దవీరులకు నివాళులర్పించనున్నారు. ఇందుకోసం అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు.
రాజ్‌భవన్‌లో గణతంత్ర దినోత్సవ వేడుకలు..
తెలంగాణ రాజ్‌భవన్‌లో 73వ గణతంత్ర దినోత్సవ వేడుకలను (Republic Day Celebration) నిర్వహించారు. రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ (Tamilisai Soundararajan) జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. దేశ ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఫ్రంట్ లైన్ వారియర్స్‌కు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. రాజ్యాంగ నిర్మాతలకు ఘనంగా నివాళులర్పిస్తున్నట్టుగా చెప్పారు.
ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ.. ‘గణతంత్ర దినోత్సవ స్పూర్తిని ప్రజల్లోకి తీసుకెళ్లాలి. ప్రపంచంలోనే అత్యుత్తమ రాజ్యాంగం మనది. అత్యుత్తమ రాజ్యాంగం అందించిన దార్శనికులకు నివాళి అర్పిస్తున్నాను. కోవిడ్ వ్యాక్సినేషన్‌లో ప్రపంచంలోనే మనదేశం ముందున్నందుకు గర్వంగా ఉంది. త్వరలో 200 డోసుల వ్యాక్సిన్ పంపిణీ పూర్తి చేసుకోబోతున్నాం. హైదరాబాద్ మెడికల్ హబ్‌గా ఎదగడం సంతోషకరం. తెలంగాణ రైస్ బౌల్ ఆఫ్ ఇండియాగా ఎదిగింది. రాష్ట్రాన్ని ముందు వరుసలో నిలిపిన రైతులకు కృతజ్ణతలు’ అని పేర్కొన్నారు.