శీనన్నా! ఈసారి బాగా మిస్‌ అవుతున్నా: సభలో కేసీఆర్ ఉద్వేగం

By sivanagaprasad KodatiFirst Published Jan 18, 2019, 11:44 AM IST
Highlights

పోచారం శ్రీనివాస్ రెడ్డిగారు తెలంగాణ శాసనసభ రెండవ స్పీకర్‌గా ఎన్నిక కావడం ఆనందంగా ఉందన్నారు తెలంగాణ సీఎం కేసీఆర్. స్పీకర్ ఎన్నిక పూర్తయిన తర్వాత సభా నాయకుడి హోదాలో కేసీఆర్ ప్రసంగించారు.

పోచారం శ్రీనివాస్ రెడ్డిగారు తెలంగాణ శాసనసభ రెండవ స్పీకర్‌గా ఎన్నిక కావడం ఆనందంగా ఉందన్నారు తెలంగాణ సీఎం కేసీఆర్. స్పీకర్ ఎన్నిక పూర్తయిన తర్వాత సభా నాయకుడి హోదాలో కేసీఆర్ ప్రసంగించారు. స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవం కావాలనే ఉద్దేశ్యంతో ఉత్తమ్ కుమార్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కె.లక్ష్మణ్, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీతో  చర్చలు జరిపానని ఇందుకు వారంతా సహకరించారని కేసీఆర్ తెలిపారు.

ఆరు సార్లు ఎమ్మెల్యేగా, పంచాయతీరాజ్, గనులు, వ్యవసాయ శాఖ మంత్రిగా సేవలందించారని గుర్తు చేశారు. తెలంగాణ తొలి వ్యవసాయశాఖ మంత్రిగా పోచారం వచ్చిన శుభవేళ రాష్ట్రంలోని రైతాంగానికి ఎన్నో కార్యక్రమాలు అమలయ్యాయన్నారు.

రైతుబంధు పథకం జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో మంచి గుర్తింపు తెచ్చుకుందని దీనికి కారణం శ్రీనివాస్ రెడ్డి గారేనని కేసీఆర్ కితాబిచ్చారు. శ్రీనివాస్ రెడ్డి ఇంటి పేరు పరిగి అని కానీ పోచారం గ్రామాన్ని ఇంటిపేరుగా మార్చుకున్నారని సీఎం అన్నారు.

1969 ఉద్యమం సమయంలో విద్యార్థిగా ఉన్న పోచారంను పోలీసులు నిర్బంధించారని అందువల్ల కెరీర్ నష్టపోయిందని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. 100 ఎకరాల వ్యవసాయ భూమి ఉన్న మీ కుటుంబం నిజాంసాగర్‌ నిర్మాణం సమయంలో కోల్పోయిందన్నారు.

తెలుగుదేశం పార్టీకి, శాసనసభ్యత్వానికి రాజీనామా చేసి టీఆర్ఎస్‌లో చేరి ఉప ఎన్నికల్లో అఖండ విజయాన్ని సాధించారని కేసీఆర్ కొనియాడారు. రెండవ విడత తెలంగాణ మంత్రిమండలిలో మిమ్మిల్ని మిస్ అవుతున్నానంటూ కేసీఆర్ ఉద్వేగానికి గురయ్యారు. సభ కూడా కుటుంబం లాంటిదని దీనిని విజయవంతంగా ముందుకు నడిపించాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. 

click me!