
రైతులను కాపాడుకునేందుకు బీజేపీపై తీవ్రస్థాయిలో పోరాటం చేయాలని కేసీఆర్ అన్నారు. తెలంగాణ భవన్‌లో పార్టీ శ్రేణులతో నిర్వహించిన విస్తృతస్థాయి సమావేశంలో కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. యాసంగి ధాన్యం కొనేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి కేంద్రంపై పోరాడాల్సిన విధానంపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. వ్యవసాయ ఉత్పత్తులకు రాజ్యాంగ రక్షణ అవసరం అని కేసీఆర్ చెప్పారు. తెలంగాణ ఉద్యమం కంటే తీవ్రంగా ఆందోళన చేపడదామని అన్నారు. మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందన్నారు. కేంద్రమే అన్ని పంటలను కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. వరి ఒక్కటే కాదు మిగిలిన అన్ని పంటలకు కేంద్రం గిట్టుబాటు ధర కల్పించాలని కోరారు.
తెలంగాణ రాష్ట్రంపై కేంద్రం పక్షపాత వైఖరిని ప్రదర్శిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. విభజన చట్టం హామీలను ప్రధాని మోదీ సర్కార్ అమలు చేయడం లేదని విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 24, 25 తేదీల్లో ఆందోళన నిర్వహించనున్నట్టుగా కేసీఆర్ చెప్పారు. గ్రామ స్థాయి నుంచి ఢిల్లీ వరకు ఉద్యమం సాగాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో రైతులందరినీ కలుపుకోని ఉద్యమించాలని చెప్పారు. కేవలం పార్టీ కార్యకర్తలే కాదు.. అంతా కలిసి పోరాటం చేయాలని అన్నారు. ఈ నెల 28న యాదాద్రికి అందరూ రావాలని పిలుపునిచ్చారు.
ఇటీవల విడుదలైన Kashmir Files Movieపై కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం ప్రజా సమస్యలను పక్కదారి పట్టిస్తోందని విమర్శించారు. దేశంలో సమస్యలను పక్కదారి పట్టించడానికే కశ్మీర్ ఫైల్స్ చిత్రాన్ని తీసుకొచ్చారని విమర్శించారు. కశ్మీర్‌లో హిందూ పండిట్‌లను చంపినప్పుడు బీజేపీ అధికారంలో లేదా? అని కేసీఆర్ ప్రశ్నించారు. దేశానికి కావాల్సింది కహ్మీర్ ఫైల్స్ కాదు.. డెవలప్‌మెంట్ ఫైల్స్ కావాలన్నారు. కశ్మీర్ ఫైల్స్‌ను వదిలిపెట్టి మోదీ సర్కార్ ప్రజా సమస్యలపై దృష్టి సారించాలన్నారు.
ఇక, కేసీఆర్ అధ్యక్షతన జరిగిన విస్తృత స్థాయి సమావేశంలో.. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, పార్టీ జిల్లా అధ్యక్షులు, జడ్పీ చైర్మన్లు, రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ల చైర్మన్లు, డీసీసీబీ, డీసీఎంఎస్, రైతు బంధు సమితుల జిల్లా అధ్యక్షులు పాల్గొన్నారు. పలువురు ఎంపీలు కూడా హాజరయ్యారు. దాదాపు 300 మందికి పైగా పార్టీ ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ప్రస్తుతానికి పార్టీ శ్రేణులతో తొలి దఫా సమావేశం ముగిసింది. ప్రస్తుతం భోజన విరామం తీసుకున్నారు. భోజన విరామం అనంతరం మరోసారి పార్టీ శ్రేణులతో సమావేశం కానున్నారు.ఆ తర్వాత నిరసన కార్యక్రమాలపై పూర్తి స్థాయిలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.