
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఆదివారం ఉదయం రోడ్డుమార్గంలో హన్మకొండ నుంచి బయలుదేరిన కేసీఆర్.. మధ్యాహ్నం భద్రాచలం చేరుకున్నారు. భద్రాచలంలో గోదావరి నదికి శాంతి పూజలు చేశారు. సహాయక శిబిరాల్లో ఉన్న నిర్వాసితులను పరామర్శించారు. శిబిరాల్లో ఉన్న వారికి ఒక్కో కుటుంబానికి తక్షణ సాయంగా రూ.10వేలు అందజేస్తామని ఆయన ప్రకటించారు. అనంతరం ఆయన భద్రాచలం నుంచి హెలికాప్టర్‌లో ఏటూరు నాగారం బయలుదేరారు.
ఆ సమయంలో భద్రాచలం నుంచి ఏటూరునాగారం వరకు గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం కేసీఆర్ ఏరియల్ సర్వే చేపట్టారు. ప్రకృతి విపత్తుతో ఉధృతంగా ప్రవహిస్తున్న గోదావరిని, నదికి ఇరువైపులా జలమయమై, నీటిలో చిక్కుకున్న గ్రామాల్లో పరిస్థితిని పరిశీలిస్తూ ఏటూరు నాగారం చేరుకున్నారు. ఏటూరు నాగారంలోని ఐటీడీఏ గెస్ట్ హౌజ్‌లో కేసీఆర్ లంచ్ చేశారు. అనంతరం కరకట్ట వద్ద ఏర్పాటు చేసిన ముంపు బాధితుల పునరావాస కేంద్రానికి వెళ్లి.. వారిని పరామర్శిస్తారు. అలాగే వరదలకు సంబంధించి అధికారులు ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను పరిశీలించనున్నారు. రామన్నగూడెం దగ్గర గోదావరికి శాంతి పూజలు చేయనున్నారు.
అంతకుముందు భద్రాచలంలో మాట్లాడిన కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. గోదావరి వరదలు క్లౌడ్ బరస్ట్ అని.. దీని వెనక విదేశీ కుట్రలు ఉన్నాయనే అనుమానం వ్యక్తం చేశారు. “మన దేశంలో క్లౌడ్ బరస్ట్‌ల వెనుక ఇతర దేశాల హస్తం ఉందని ధృవీకరించబడని నివేదికలు ఉన్నాయి. ఈ కుట్రలు ఎంత వరకు నిజమో తెలియదు. ఇతర దేశాల వాళ్లు కావాలని మన దేశంలో అక్కడక్కడ క్లౌడ్ బరస్ట్ చేస్తున్నారు. గతంలో లేహ్ లడఖ్‌లో, తర్వాత ఉత్తరాఖండ్‌లో, ఇప్పుడు గోదావరి పరివాహక ప్రాంతంపై కూడా క్లౌడ్ బరస్ట్ చేస్తున్నట్లు సమాచారం ఉంది’’ అని కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
గోదావరికి ఉపనది అయిన కడెం నదిపై నిర్మల్ జిల్లాలో నిర్మించిన కడెం డ్యామ్ వరదలను అద్భుతంగా తట్టుకుని నిలిచిందని కేసీఆర్ అన్నారు. “డ్యామ్ మనుగడ సాగించడం దేవుడు చేసిన అద్భుతం. దీని గరిష్ట సామర్థ్యం దాదాపు 2.90 లక్షల క్యూసెక్కులు. అయితే ఈ వరద సమయంలో అది 5 లక్షల క్యూసెక్కులకు చేరి ఇప్పటికీ నిలవడం ఒక అద్భుతం. భారీ వరదలు వచ్చినా ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు’’ అని కేసీఆర్ చెప్పారు.
ఈ నెలాఖరు వరకు వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అధికారులు విశ్రాంతి తీసుకోవద్దని ముఖ్యమంత్రి హెచ్చరించారు. నీరు తగ్గుముఖం పట్టడంతో క్రిమిసంహారక మందులను పిచికారీ చేయడం ప్రారంభించాలని ఆరోగ్య అధికారులను ఆదేశించారు. అంటువ్యాధి ముప్పు గురించి హెచ్చరించారు. స్థానిక వైద్య బృందాలకు సహాయం చేయడానికి వరంగల్‌లోని మహాత్మా గాంధీ వైద్య కళాశాల వైద్యులతో సహా పొరుగు జిల్లాల నుంచి వైద్య, ఆరోగ్య బృందాలను జిల్లాలో మోహరించనున్నట్లు తెలిపారు.