జగిత్యాల జిల్లాలో రైతు జలపతి రెడ్డి ఆత్మహత్యకు కారణమైన న్యాయవాదిపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ఈ విషయమై ఇవాళ డీజీపీని కలిసి వినతి పత్రం సమర్పించింది.
హైదరాబాద్ : జగిత్యాల జిల్లాలో ఇద్దరు కూతుళ్లతో కలిసి రైతు జలపతిరెడ్డి ఆత్మహత్యకు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క హైద్రాబాద్ కాంగ్రెస్ శాసనసభపక్ష కార్యాలయంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డితో కలిసి సోమవారం నాడు మీడియాతో మాట్లాడారు. జగిత్యాలలో రైతు తన ఇద్దరు పిల్లలతో కలిసి రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటనపై పూర్తి విచారణ చేయాలని డీజీపీని కలిసినట్టుగా ఆయన చెప్పారు.
పేదలకు ఇళ్లు కట్టించాలనే ఉద్దేశ్యంతో నర్సింగాపూర్ గ్రామంలో అప్పటి ప్రభుత్వం 1985లో భూసేకరణ చేసిందని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి చెప్పారు. భూమిని ఇచ్చిన రైతులకు పరిహరం చెల్లింపు విషయంలో న్యాయం జరగలేదన్నారు. దీంతో రైతులు కోర్టును ఆశ్రయించినట్టుగా జీవన్ రెడ్డి చెప్పారు. పరిహరం కోసం జగిత్యాల, హైకోర్టుల్లో కోర్టుల్లో రైతులు పోరాటం చేశారని ఆయన చెప్పారు. చివరకు రైతులకు పరిహరం చెల్లించాలని కోర్టు తీర్పు చెప్పిందని జీవన్ రెడ్డి వివరించారు. .భూ పరిహరం డబ్బులు 2021లో కోర్టులో డిపాజిట్ అయ్యాయని జీవన్ రెడ్డి గుర్తు చేశారు. కానీ అప్పటి నుండి ఈ డబ్బులను రైతులకు అందించే విషయంలో న్యాయవాది చొరవ చూపడం లేదని జీవన్ రెడ్డి ఆరోపించారు. ఈ విషయమై న్యాయవాదిని వేడుకున్నా కూడా ఆయన నుండి సరైన స్పందన లేదన్నారు. దీంతో జలపతి రెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడని జీవన్ రెడ్డి చెప్పారు.
ఆత్మహత్యకు ముందు జలపతి రెడ్డి సూసైడ్ నోట్ , సెల్ఫీ వీడియోను పోలీసులు పట్టించుకోలేదని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు.ఈ విషయమై ఇంతవరకు ఎవరిపై కూడా పోలీసులు చర్యలు తీసుకోలేదని భట్టి విక్రమార్క చెప్పారు. జలపతిరెడ్డి సెల్ఫీ వీడియోతో పాటు ఇతర ఆధారాలను ఇవాళ డీజీపీ అంజనీకుమార్ కు అందించినట్టుగా భట్టి విక్రమార్క వివరించారు. జలపతిరెడ్డి ఆత్మహత్యకు కారణమైన వారిని అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు.