ఢిల్లీ లిక్కర్ స్కాంపై సీబీఐ విచారణ చేయించాలి:సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క

By narsimha lodeFirst Published Aug 23, 2022, 2:27 PM IST
Highlights

ఢిల్లీ లిక్కర్ స్కాం తో సంబంధం ఉన్న వారిపై సీబీఐ తో విచారణ చేయాలని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క  డిమాండ్ చేశారు. కేబినెట్ లో రూపొందించాల్సిన పాలసీ హోటల్ రూమ్ లో తయారు చేయడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. 

హైదరాబాద్:ఢిల్లీ లిక్కర్ స్కాంతో సంబంధం ఉన్న వారిపై సీబీఐ తో విచారణ చేయాలని  సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఆయన డిమాండ్ చేశారు.మంగళవారం నాడు సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క హైద్రాబాద్ లో మీడియాతో మాట్లాడారు . ఢిల్లీలోని మద్యం విధానం, తెలంగాణ మద్యం విధానం కూడా ఒక్కటేనని  మల్లు భట్టి విక్రమార్క చెప్పారు.  ఢిల్లీలో హోటల్ లో లిక్కర్ పాలసీని రూపొందించడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. పాలసీలు కేబినెట్ లో నిర్ణయించాల్సి ఉందన్నారు. కానీ హోటల్ రూమ్ లోనే ఈ పాలసీని రూపొందించారని  భట్టి విక్రమార్క ఆరోపించారు.  

తెలంగాణ విధానాన్ని ఢిల్లీలో అమలు చేసినందున ఢిల్లీలో లిక్కర్ స్కాం  జరిగిందని చెబుతున్నారన్నారు. అదే నిజమైతే తెలంగాణ రాష్ట్రంలో ఎంత పెద్ద కుంభకోణం జరిగి ఉంటుందోనని ఆయన ప్రశ్నించారు. ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో రూ. 10 వేల కోట్ల ఎక్సైజ్ శాఖ నుండి ఆదాయం వచ్చేదన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత  ఎక్సైజ్ శాఖ ద్వారా ఆదాయం రూ. 30 వేల కోట్లకు చేరిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. రాష్ట్రంలో ఎనిమిది ఏళ్లుగా ఏ కంపెనీలు మద్యం సరఫరా చేస్తున్నారో చెప్పాలని మల్లు భట్టి విక్రమార్క కోరారు. మద్యం ధరలను నిర్ణయించే విషయంలో ఏ కమిటీలు నిర్ణయం తీసుకొన్నాయో చెప్పాలన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత పాత్ర ఉందని  ఆరోపణలు వచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

 రాజకీయ అవసరాల కోసం ఈడీ, సీబీఐలను ఉపయోగించుకోకుండా ప్రజా ధనం దుర్వినియోగం అయ్యే అంశంపై ఈ సంస్థలతో విచారణ చేయించాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ బ్రేవరేజేస్ కార్పోరేషన్ లో ఎక్కువ కాలం పాటు ప్రస్తుత సీఎస్ సోమేష్ కుమార్ ఎక్కువ కాలం పాటు పనిచేశారని ఆయన గుర్తు చేశారు. మద్యం ధరల నిర్ణయించే సమయంలో ఏం జరిగిందో లోతుగా విచారణ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.  ఢిల్లీ లిక్కర్ స్కాం విషయమై మీడియాలో వస్తున్న కథనాలను కూడా ఆయన ప్రస్తావించారు. ఈ విషయాలపై టీఆర్ఎస్ నేతలు సమాధానం చెప్పాలన్నారు. 

also read:లిక్కర్ స్కామ్‌పై ఆరోపణలు: బీజేపీ నేతలపై పరువు నష్టం దావా వేసిన కల్వకుంట్ల కవిత

డబ్బు ఏ రూపంలో వచ్చిన తీసుకొనేందుకు ఎమ్మెల్సీ కవిత వెనుకాడరని ఎఐసీసీ సెక్రటరీ మధు యాష్కీ ఆరోపించారు. ట్రిపుల్ బెడ్ రూమ్ ఫ్లాట్ లో ఉండే కవితకు 8 ఏఃళ్లలో రూ. 300 కోట్ల విలువ చేసే భవనాలు, భవంతులు వచ్చాయో చెప్పాలన్నారు. బెంగుళూరులో భవనాలు ఎక్కడివో కూడా చెప్పాలని ఆయన అడిగారు. లిక్కర్ స్కాం విషయమై బీజేపీ నేతలు ఆరోపణలు చేయగానే  టీఆర్ఎస్ నేతలు ఉలిక్కి పడుతున్నారన్నారు.ల్యాండ్, శాండ్, లిక్కర్ మాఫియాల్లో టీఆర్ఎస్ నేతలదే కీలక పాత్ర అని మధు యాష్కీ ఆరోపించారు. మహిళగా ఉంటూ కవిత లిక్కర్ వ్యాపారం చేయడం సిగ్గు చేటన్నారు. 
 

click me!