కాళేశ్వరం లెక్కలు ఇవి.. చర్చకు సిద్ధమా: కేసీఆర్‌కు భట్టి సవాల్

By Siva KodatiFirst Published Feb 20, 2021, 10:36 PM IST
Highlights

కాళేశ్వరం నీళ్లు, తెచ్చిన అప్పులపై రాష్ట్రంలో ఎక్కడైనా సరే చర్చకు సిద్ధమా అని సీఎం కేసీఆర్‌కు సవాల్ విసిరారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. రైతులతో ముఖాముఖిలో భాగంగా శనివారం సూర్యాపేటలో జరిగిన సమావేశంలో ఆయన ప్రసంగించారు

కాళేశ్వరం నీళ్లు, తెచ్చిన అప్పులపై రాష్ట్రంలో ఎక్కడైనా సరే చర్చకు సిద్ధమా అని సీఎం కేసీఆర్‌కు సవాల్ విసిరారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. రైతులతో ముఖాముఖిలో భాగంగా శనివారం సూర్యాపేటలో జరిగిన సమావేశంలో ఆయన ప్రసంగించారు.

ఇక్కడ జరుగుతున్నది రాజకీయ సమావేశం కాదని..  ఎన్నికల సమావేశం అంతకన్నాకాదని తెలిపారు. కేంద్రం తీసుకువచ్చిన నల్ల చట్టాలు అమల్లోకి వస్తే.. కోట్లాది మంది రైతుల జీవితాలు దుర్భరంగా మారతాయని భట్టి హెచ్చరించారు.

ఐకేపీ సెంటర్లు, కొనుగోలు కేంద్రాలు కొనసాగాలని కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తున్నట్లు భట్టి విక్రమార్క చెప్పారు. రైతులతో ముఖాముఖీ అనేది విమర్శలు చేసే వేదికకాదని.. కేవలం వాస్తవాలు, రైతుల కష్టాలు చర్చించుకునే సమావేశం మాత్రమేనని భట్టి స్పష్టం చేశారు. 

పొలం బ్రహ్మండంగా ఉంది.. రైతులు బాగున్నారు అంటున్నారు.. నిజంగా పొలం బాగుంటే చందుపట్ల గ్రామంలో ఎండిపోయిన వరిపంటను చూపిస్తూ.. రైతు కన్నీళ్లు పెట్టాల్సిన అవసరం ఏమోచ్చిందని కేసీఆర్‌ను భట్టి నిలదీశారు.

ఈ ప్రాంతానికి మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి శ్రమ ఫలితమే.. ఎస్సారెస్సీ కాలువ వచ్చిందని విక్రమార్క గుర్తుచేశారు. గాలివాటపు గెలుపుతో వచ్చిన మంత్రి పదవితో స్థానికమంత్రి జగదీశ్వర్ రెడ్డి అబద్దాలు మాట్లాడుతున్నారని భట్టి విమర్శించారు.

మంత్రి చెబుతున్నట్లు ఇవి కాళేశ్వరం నీళ్లు కావని.. నాడు కాంగ్రెస్ ప్రభుత్వాలు కట్టించిన శ్రీరాంసాగర్, ఎస్సారెస్పీ.. డిండీ ప్రాజెక్టుల వల్ల వచ్చిన నీళ్లని భట్టి వివరించారు.

ఏడేళ్ల పాలనలో కేసీఆర్ కొత్తగా కట్టిన ఒక్క ప్రాజెక్ట్ కూడా లేదని విక్రమార్క ఎద్దేవా చేశారు. రాత్రిపూటో.. పగలు మత్తులో మాట్లాడే మాటలు ప్రజలు నమ్మరని భట్టి సెటైర్లు వేశారు. కాళేశ్వరం లెక్కలు.. అప్పులు.. పారిన నీళ్లపై రాష్ట్రంలో మీరు ఎక్కడ చర్చకు పెట్టినా నేను సిద్ధమేనని భట్టి ఛాలెంజ్ చేశారు.

click me!