
పంజాబ్‌లో భద్రతా లోపం (security lapse in punjab) కారణంగా ప్రధాని మోడీ (narendra modi) తన పర్యటనను రద్దు చేసుకున్న వ్యవహారం దేశవ్యాప్తంగా దుమారం రేగింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు దీనిపై దర్యాప్తు చేస్తున్నాయి. అటు పంజాబ్ డీజీపీపై (punjab dgp) కేంద్రం వేటు వేసి ఆయన స్థానంలో మరొకరిని నియమించింది. ఈ వ్యవహారంపై సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క (bhatti vikramarka) స్పందించారు. ఆదివారం మీడియాతో ఆయన మాట్లాడుతూ.. పంజాబ్‌లో ప్రధాని మోడీ డ్రామా చేశారని ఎద్దేవా చేశారు.
ప్రధాని పదవి స్థాయిని మోడీ దిగజార్చారని భట్టి విక్రమార్క అన్నారు. కాంగ్రెస్ (congress) పంజాబ్‌లో (punjab) దళితుణ్ని ముఖ్యమంత్రిని చేస్తే బీజేపీకి (bjp) నచ్చలేదని ఆయన దుయ్యబట్టారు. గతంలో ప్రధానులు ఇంత చౌకబారుగా వ్యవహారాలు నడపలేదని భట్టి గుర్తుచేశారు. ఓ సభలో ఇందిరా గాంధీపై (indira gandhi) రాయి విసిరితే గాయమైనా చలించకుండా ప్రసంగం కొనసాగించారని ఆయన వెల్లడించారు. అయినా ఇందిర అప్పటి రాష్ట్ర ప్రభుత్వాన్ని నిందించలేదని విక్రమార్క గుర్తుచేశారు. డ్రామా చేసి దళిత సీఎంను నవ్వుల పాలు చేయాలని చూశారని ఆయన పేర్కొన్నారు. జీవో నెం 317తో స్థానికత అనే దానికి న్యాయం లేకుండా పోయిందని భట్టి ఎద్దేవా చేశారు.
కాగా...పంజాబ్‌లో వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోడీ బుధవారం భటిండా విమానాశ్రయంలో దిగారు. అక్కడి నుంచి ఆయన హెలికాప్టర్‌లో ఫిరోజ్‌పుర్‌లోని హుస్సేనీవాలాలో ర్యాలీలో ప్రసంగించాల్సి ఉంది. అయితే ఆయన హెలికాప్టర్ ప్రయాణానికి వాతావరణం ప్రతికూలంగా మారింది. దీంతో దాదాపు 20 నిమిషాలు విమానాశ్రయంలోనే ప్రధాని వేచి చూశారు. వాతావరణం మెరుగుపడకపోవడంతో.. రోడ్డు మార్గంలోనే హుస్సేనీవాలాకు వెళ్లాలని మోడీ నిర్ణయించుకున్నారు. ప్రధాని భద్రతా సిబ్బంది ఈ సమాచారాన్ని పంజాబ్ పోలీసులకు అందించారు.
దీనిపై స్పందించిన పంజాబ్ డీజీపీ.. రోడ్డు మార్గంలో ప్రయాణించడానికి సంబంధించిన అనుమతులు రావడంతో ప్రధాని భటిండా ఎయిర్‌పోర్ట్ నుంచి బయల్దేరారు. గమ్యస్థానం మరో 30 నిమిషాల్లో సమీపిస్తుందనగా.. మోడీ కాన్వాయ్ ఓ ఫ్లైఓవర్‌కు చేరుకుంది. ఆ సమయంలో ఎక్కడి నుంచి వచ్చారో గానీ 100 మంది రైతులు ఆ రహదారిని దిగ్బంధించారు. దీంతో కారులోనే ప్రధాని కాసేపు వేచిచూశారు. ఎంతకీ పరిస్థితి మెరుగుపడక ప్రధాని తిరిగి విమానాశ్రయానికి చేరుకుని ఢిల్లీ చేరుకున్నారు.