
విజయవాడ:తనకు ఎవరితో గ్యాప్ లేదని చిన్న జీయర్ స్వామి తేల్చి చెప్పారు.తెలంగాణ సీఎం KCR తో Chinna jeeyar swamy కి గ్యాప్ వచ్చిందని జరుగుతున్న ప్రచారంపై కూడా ఆయన తేల్చి చెప్పారు.శుక్రవారం నాడు విజయవాడలో జరిగిన మీడియా సమావేశంలో మీడియా ప్రతినిధుల ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పారు. వాళ్లు దూరంగా ఉంటే మాకు సంబంధం లేదని జీయర్ స్వామి వివరణ ఇచ్చారు. మేం ఎవరితో పూసుకు తిరగమని తేల్చి చెప్పారు.
ఎవరైనా గ్యాప్ పెట్టుకొంటే తాను ఏమీ చేయలేనన్నారు. మంచి లక్ష్యంతో మంచి కార్యక్రమాలు చేయాలని తాను కోరుకొంటానన్నారు. మోసం చేయకుండా ఉండాలనే మార్గంలో తాను నడుస్తానని జీయర్ స్వామి వివరించారు. ఇలా ఉన్నందునే తాను ఏ విషయమై ధైర్యంగా మాట్లాడుతున్నానని చెప్పారు. లేకపోతే వీటికి వాటికి జడుస్తూ మాట్లాడాల్సి వస్తోందన్నారు.
1986 లో చల్లా కొండయ్య కమిషన్ కు వ్యతిరేకంగా కూడా ధైర్యంగా మాట్లాడిన విషయాన్ని గుర్తు చేశారు.
తన లాంటి వాళ్లు సమాజానికి కళ్ల వంటి వాళ్లని జీయర్ స్వామి వివరించారు. తమ బాధ్యతను సక్రమంగా నెరవేర్చాల్సిన అవసరం ఉందని జీయర్ స్వామి నొక్కి చెప్పారు. కాషాయం కట్టుకున్న వారంతా వారి బాధ్యతను సక్రమంగా నెరవేరస్తున్నారా లేదా అనేది మీరు చెక్ చేయాలని ఆయన మీడియా ప్రతినిధులకు సూచించారు. అంతే కాదు ఈ విషయాలపై వాస్తవాలు ప్రజలకు వివరించాలన్నారు. అంతేకాదు మీరు కూడా రాజకీయాల్లోకి వస్తారా అని ప్రశ్నించడం సరైందేనా అన్నారు. తాము ఎప్పుడైనా రాజకీయాల్లోకి వచ్చేలా మాట్లాడానా అని జీయర్ స్వామి ప్రశ్నించారు.
ఎవరైనా ఏదైనా సలహా అడిగితే చెప్పడం తన బాధ్యత అన్నారు. ఏదైనా పని చేసి పెట్టాలని ఎవరైనా కోరితే ఆ పని చేసి పెట్టడం తమ బాధ్యత అని జీయర్ స్వామి చెప్పారు. ఏదైనా బాధ్యతను తాను తీసుకుంటే ఆ బాధ్యతను నెరవేర్చేందుకు వందకు వంద శాతం న్యాయం చేస్తానని జీయర్ స్వామి వివరించారు. నాకు ఫలానా బాధ్యతలు కావాలని కూడా ఏనాడూ కూడా తాము ఎవరి వెంట పడి తిరగలేదన్నారు. పిలిస్తే వెళతాం, లేదంటే చూసీ ఆనందిస్తామని యాదాద్రి ఆలయం ప్రారంభోత్సవానికి సంబంధించి జీయర్ స్వామి వ్యాఖ్యలు చేశారు.