
బాల్య వివాహాలును అరికట్టేందుకు అధికారులు ఎన్ని చర్యలు చేపట్టిన.. ఎక్కడో ఓ చోట దొంగచాటుగా జరుగుతూనే ఉన్నాయి. తాజాగా నిజామాబాద్ జిల్లాలోని నవీపేట మండలం అబ్బాపూర్ (బి) తండాలో అర్థరాత్రి వేళ 13 ఏళ్ల మైనర్ బాలికను 45 ఏళ్ల సాయబ్ రావ్ అనే వ్యక్తికి ఇచ్చి బాల్య వివాహం జరిపించారు. అయితే సాయబ్ రావ్‌కు అప్పటికే పెళ్లి జరిగి భార్య మరణించింది. అతనికి ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు. వారి వయసు కంటే తక్కువ వయసు ఉన్న బాలికను అతడు శుక్రవారం అర్దరాత్రి పెళ్లి చేసుకున్నాడు.
గ్రామస్తుల సహకారంతోనే ఈ పెళ్లి జరిగినట్టుగా తెలుస్తోంది. బాధిత బాలిక చదవు మధ్యలోనే మానేసిందని సమాచారం. అయితే శుక్రవారం రాత్రి ఆమెకు సాయబ్ రావ్‌తో పెళ్లి చేసేందుకు ఆమె సంబంధీకులు నిర్ణయించారు. అయితే ఈ విషయం తెలుసుకున్న అంగన్‌వాడీ టీచర్‌తో పాటు పలువురు ఈ విషయాన్ని తెలుసుకొని జిల్లా బాలల పరిరక్షణ అధికారులు, పోలీసులకు అదే రాత్రి సమాచారం అందజేశారు.
అయితే పోలీసులు అక్కడికి చేరుకునే లోపే పెళ్లి జరిగిపోయింది. అయితే పోలీసులు వస్తున్నారనే ముందస్తు సమాచారంతో.. సాయబ్ రావు తాను పెళ్లి చేసుకున్న బాలికను తీసుకుని అక్కడ నుంచి పారిపోయాడు. అయితే ప్రస్తుతానికి సాయబ్ రావు ఎక్కడికి వెళ్లాడనేతి తెలియాల్సి ఉంది. ఇదిలా ఉంటే, ఈ ఘటనపై బాలల పరిరక్షణ అధికారులు, ఐసీడీఎస్ అధికారులు, పోలీసులు విచారణ చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి చర్యలు తీసుకోవాలని గ్రామ పంచాయతీ కార్యదర్శి హైమద్ పాషా అధికరులకు ఫిర్యాదు చేశారు.