కోట్లు స్వాహా: బీజేపీ నేత మురళీధర్ రావుపై చీటింగ్ కేసు

By Siva KodatiFirst Published Mar 27, 2019, 8:16 AM IST
Highlights

బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావుపై చీటింగ్ కేసు నమోదైంది. 

బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావుపై చీటింగ్ కేసు నమోదైంది. కేంద్ర వాణిజ్య శాఖ ఆధ్వర్యంలోని ఫార్మా ఎక్సిల్ చైర్‌పర్సన్‌గా నామినేటెడ్ పోస్టు ఇప్పిస్తామని తన వద్ద నుంచి రూ.2.10 కోట్లు వసూలు చేసి మోసం చేశారంటూ చంపాపేట్‌కు చెందిన తాళ్ల ప్రవర్ణారెడ్డి రంగారెడ్డి మెట్రోపాలిటిన్ మెజిస్ట్రేట్ కోర్టులో ప్రైవేటు పిటిషన్ వేశారు.

దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం దర్యాప్తు జరిపి నివేదిక సమర్పించాలని హైదరాబాద్ సరూర్‌నగర్ పోలీసులను ఆదేశించింది. మురళీధర్ రావుతో పాటు ఆయన సన్నిహితులైన కృష్ణ కిశోర్, ఈశ్వర్ రెడ్డి, ఎం రామచంద్రారెడ్డి, జీ హనుమంతరావు, సామ చంద్రశేఖర్ రెడ్డి, బాబా, శ్రీకాంత్‌‌లు నామినేటెడ్ పదవి గురించి తనను తన భర్త మహిపాల్ రెడ్డిని నమ్మించారని ప్రవర్ణా పిటిషన్‌లో పేర్కొన్నారు.

రూ.2.10 కోట్లు వసూలు చేసిన తర్వాత నాటి కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సంతకంతో ఉన్న ఓ నకిలీ అపాయింట్‌మెంట్ లెటర్‌ను తమకు అప్పగించారని తెలిపారు.

అప్పటి నుంచి నేడు, రేపు అంటూ కాలయాపన చేయడంతో తాము డబ్బు తిరిగి ఇవ్వాల్సిందిగా వారిపై ఒత్తిడి తెచ్చినట్లు ప్రవర్ణారెడ్డి చెప్పారు. దీంతో మురళీధర్‌రావు నుంచి తమకు బెదిరింపులు వచ్చినట్లు తెలిపారు.

దీనిపై ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. దీంతో మురళీధర్‌రావు సహా మిగిలిన ఎనిమిది మందిపై ఐపీసీ సెక్షన్ 406, 420, 468తో పాటు 471, 506, 156(3) కింద పోలీసులు చీటింగ్ కేసుతో పాటు కేంద్రమంత్రి నిర్మల సంతకాన్ని ఫోర్జరీ చేశారనే అభియోగం కింద మరో కేసు నమోదు చేశారు. 

click me!
Last Updated Mar 27, 2019, 8:16 AM IST
click me!