
అమరావతి: తెలంగాణకు కేంద్రం నిధులు ఇవ్వడాన్ని ఆహ్వానిస్తున్నట్లు ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. హైదరాబాద్ అభివృద్ధిలో తన పాత్ర కీలకమని చంద్రబాబు గుర్తు చేశారు. హైదరాబాద్‌లో చేపట్టిన ప్రతి పనిలో తన ముద్ర ఉంటుంది అని చంద్రబాబు తెలిపారు. అయితే ఏపీకి నిధులు ఎందుకివ్వరని కేంద్రాన్ని నిలదీస్తున్నామన్నారు. వెనుకబడిన జిల్లాలకు ఇచ్చిన నిధులను తిరిగి వెనక్కి తీసుకున్నారని చంద్రబాబు ఆరోపించారు.
ఏపీపై కేంద్రం దాడి చేస్తోందని, ఒకేసారి 19 ఐటీ బృందాలతో తనిఖీలు చేయించిందని మండిపడ్డారు. కేంద్రం బెదిరింపులకు భయపడేది లేదని ఎంతటి పోరాటానికైనా సిద్ధమని చంద్రబాబు స్పష్టం చేశారు.
పోలవరం ప్రాజెక్టు పనులు 60శాతం పూర్తైందని, పట్టిసీమ పూర్తయితే రాజకీయ సన్యాసం చేస్తామన్నారని, పట్టిసీమ పూర్తయిన తర్వాత తోక జాడించారని ప్రతిపక్ష పార్టీలపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో 47 ప్రాజెక్టులను పూర్తిచేసే బాధ్యత తమదేనని స్పష్టం చేశారు. టీడీపీ అధికారంలో లేకపోతే ఏపీ కుక్కలు చింపిన విస్తరి అవుతుందన్నారు.
కేంద్ర ప్రభుత్వం నమ్మకద్రోహం చేసిందన్న చంద్రబాబు హేతుబద్ధత లేకుండా రాష్ట్రాన్ని విభజించారంటూ ధ్వజమెత్తారు. ప్రత్యేకహోదా ఇస్తామని హామీ ఇచ్చి మాట తప్పారని చెప్పారు.
తాము ఎన్డీయే ప్రభుత్వంపై ధర్మపోరాటం చేస్తుంటే ప్రతిపక్ష పార్టీలు లోపాయికారి ఒప్పందంతో టీడీపీని దెబ్బతీయాలని చూస్తున్నారని ఆరోపించారు. ఎన్డీయే నుంచి టీడీపీ బయటకు వచ్చాక బీజేపీపై పవన్, జగన్ ఒక్క మాట కూడా మాట్లాడలేదు.