
తెలంగాణలోని తెలుగుదేశం పార్టీ మాజీ నేతలంతా మళ్లీ పార్టీలో చేరాలని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. టీడీపీ నుంచి వెళ్లి ఎక్కడ పనిచేస్తున్నా ఆత్మగౌరవంతో మళ్లీ పార్టీలో చేరాలని సూచించారు. తెలుగుదేశం పార్టీ పుట్టిన తెలంగాణలో పార్టీకి పూర్వ వైభవాన్ని తీసుకోస్తామని చెప్పారు. తెలుగు రాష్ట్రాలు అభివృద్ది చెందాలంటే రెండు చోట్ల టీడీపీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ బాధ్యతల కార్యక్రమం గురువారం హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. అంతకుముందు చంద్రబాబు నాయుడు తన నివాసం నుంచి ర్యాలీగా ఎన్టీఆర్ ట్రస్టు భవన్‌కు చేరుకున్నారు.
టీడీపీ వెనుకబడిన వర్గాల నాయకత్వాన్ని ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తుందని చంద్రబాబు చెప్పారు. ఇప్పుడు దీనినే ఇతర ప్రధాన రాజకీయ పార్టీలన్నీ అనుసరిస్తున్నాయని అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారి ఆత్మగౌరవం కోసం టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ అవిశ్రాంతంగా కృషి చేశారని చెప్పారు. అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణల నేపథ్యంలో.. తెలుగుదేశం ప్రభుత్వం హైదరాబాద్‌లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగాన్ని ప్రోత్సహించిందని చెప్పారు.
సైబరాబాద్‌ను ఏర్పాటు చేసినందుకు గర్విస్తున్నానని చెప్పారు. ఇది వేలాది కుటుంబాల ఆర్థిక వ్యవస్థను పెంచుతుందని తెలిపారు. ఐటీ, ఓఆర్‌ఆర్, ఆర్‌జీఐఏ, ఫ్లైఓవర్‌ల వంటి తన కార్యక్రమాలను తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు వైఎస్ రాజశేఖర్ రెడ్డి, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి, కేసీఆర్.. ముందుకు తీసుకెళ్లారని అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత అవశేష ఏపీ అభివృద్ధిపై దృష్టి కేంద్రీకరించానని చెప్పారు.
తమ ఉజ్వల భవిష్యత్తు కోసం తెలంగాణ రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసేందుకు నాయకులు ముందుకు రావాలని చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. తెలుగు ప్రజల ప్రయోజనాల కోసం టీడీపీ ఎప్పుడూ పనిచేస్తుందన్నారు. టీడీపీ హయాంలో నీటిపారుదల ప్రాజెక్టులు, ఐటీ, విద్య తదితర రంగాల్లో తెలంగాణకు అత్యంత ప్రాధాన్యత లభించిందని చెప్పారు. తాము నాలెడ్జ్ ఎకానమీని బలంగా విశ్వసించామని.. ప్రతిష్టాత్మక విద్యా సంస్థలను తీసుకువచ్చామని తెలిపారు.
కాసాని జ్ఞానేశ్వర్ ఆధ్వర్యంలో తెలంగాణలో పార్టీ బలపడుతుందని చంద్రబాబు నాయుడు ధీమా వ్యక్తం చేశారు. ఆయనకు అభినందనలు తెలిపారు. ఇప్పటివరకు టీటీడీపీ అధ్యక్షునిగా పనిచేసిన బక్కని నర్సింహులును ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు రావుల చంద్రశేఖర్ రెడ్డి, అరవింద్ కుమార్ గౌడ్, కంభంపాటి రామ్మోహన్ రావు, నన్నూరి నర్సిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.