ఆంధ్ర సెటిలర్లపై చంద్రబాబు ఆశలు గల్లంతు

By pratap reddyFirst Published Dec 11, 2018, 11:32 AM IST
Highlights

2014 ఎన్నికల్లో ఆంధ్ర సెటిలర్ల కారణంగానే గ్రేటర్ హైదరాబాదులో టీడీపికి అత్యధిక స్థానాలు వచ్చాయి. టీడీపి నుంచి గెలిచినవారు తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)లోకి మారారు. 

హైదరాబాద్: తెలంగాణ ఎన్నికల్లో ఆంధ్ర సెటిలర్లపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పెట్టుకున్న ఆశలు గల్లంతయ్యాయి. చంద్రబాబుతో పొత్తు పెట్టుకుని ఆంధ్ర సెటిలర్లు అధికంగా ఉన్న నియోజకవర్గాల్లో పాగా వేయాలనే కాంగ్రెసు వ్యూహం బెడిసి కొట్టింది. 

నిజానికి, 2014 ఎన్నికల్లో ఆంధ్ర సెటిలర్ల కారణంగానే గ్రేటర్ హైదరాబాదులో టీడీపికి అత్యధిక స్థానాలు వచ్చాయి. టీడీపి నుంచి గెలిచినవారు తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)లోకి మారారు. దీంతో టీఆర్ఎస్ లోకి జంప్ చేసిన టీఆర్ఎస్ అభ్యర్థులను కాదని తెలుగుదేశం, ఇతర ప్రజా కూటమి నేతలను రంగారెడ్డి, హైదరాబాదు జిల్లాల్లో సెటిలర్లు గెలిపిస్తారని భావించారు. 

కానీ, ప్రజా కూటమి నేతల అంచనా ఏ మాత్రం ఫలించలేదు. అయితే, చంద్రబాబు వ్యూహాన్ని క్రమపద్ధతిలో తిప్పికొట్డడంలో ఐటి మంత్రి కేటీ రామారావు వ్యూహాత్మకంగా పనిచేశారు. ఆంధ్ర సెటిలర్లతో ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేసి, తమ ప్రభుత్వం ఇంతకు ముందు ఏం చేసింది, తిరిగి అధికారంలోకి వస్తే ఏం చేస్తుందనే విషయాన్ని ఆయన వివరించారు. 

తాము ఆంధ్రుల పట్ల స్నేహపూర్వకంగా వ్యవహరిస్తుంటే చంద్రబాబు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారనే విషయాన్ని ఆయన చెప్పారు. హరికృష్ణ అంత్యక్రియల విషయంలో తాము అనుసరించిన వైఖరిని ఆయన పదే పదే ప్రస్తావించారు. హైదరాబాదులో శాంతిభద్రతలను తాము కాపాడిన వైనాన్ని ఆయన చెప్పుకొచ్చారు. 

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తాము ఆంధ్రుల పట్ల ఏ మాత్రం వివక్ష ప్రదర్శించలేదని, వారికి పూర్తి భద్రతను ఖాయం చేశామని ఆయన గుర్తు చేశారు. కేటీఆర్ ఆత్మీయ సమావేశాలు చంద్రబాబు వ్యూహాలను దెబ్బ తీశాయని చెప్పవచ్చు.

అదే సమయంలో ఆంధ్ర సెటిలర్లలో చీలికలు కూడా వచ్చాయి. కూకట్ పల్లి, శేరిలింగంపల్లి వంటి ఆంధ్ర సెటిలర్లు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో కూడా కారు దూసుకుపోయింది. ఇందుకు ఆంధ్ర సెటిలర్లలో సామాజిక వర్గావారీగా వచ్చిన చీలకలు కారణమని చెప్పవచ్చాయి. ఆంధ్రలో అధికారంలో ఉన్న సామాజిక వర్గానికి వ్యతిరేకంగా బలమైన ఇతర రెండు సామాజిక వర్గాలు తెలంగాణలో పనిచేశాయి. 

దాన్నే చంద్రబాబు మాటల్లో చెప్పాలంటే.. జనసేన అధినేత పవన్ కల్యాణ్, వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అధినేత కేసీఆర్ తో చేతులు కలిపారు. ప్రజా కూటమి ఓటమికి ప్రధాన కారణంగా చెప్పవచ్చు. 

ఇకపోతే, పోలింగ్ సందర్బంగా వరుసగా సెలవులు వచ్చాయి. ఆ సెలవుల్లో హైదరాబాదులోని ఆంధ్ర ప్రాంత ప్రజలు తమ సొంత ఊళ్లకు వెళ్లి ఉంటారనే అంచనా సాగుతోంది. హైదరాబాదులో తక్కువ పోలింగ్ శాతం నమోదు కావడానికి ఇది కూడా ఓ కారణంగా చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఎత్తుగడలో హైదరాబాదులోనూ, రంగారెడ్డి జిల్లాల్లోనూ పారలేదని చెప్పవచ్చు. 

click me!