''సబ్బండ వర్గాల ఆత్మగౌరవానికి, మహిళా చైతన్యానికి ప్రతీక చాకలి ఐలమ్మ..''

By Mahesh Rajamoni  |  First Published Sep 10, 2023, 12:09 PM IST

Jangaon: చాకలి ఐలమ్మ ధైర్యం, తెగువ చూపుతూ ఆనాటి దేశ్ ముఖులు, రజాకార్ల గుండెల్లో భయం పుట్టించిందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఒకవైపు సాయుధ పోరాటం చేస్తూనే, మరోవైపు అమ్మ లాగా ఉద్యమకారులకు అన్నం పెట్టి ఆదరించిన మహనీయురాలని పేర్కొన్నారు. 
 


Chakali Ailamma death anniversary: చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆమె స్వగ్రామం, జనగామ జిల్లా పాలకుర్తి లోని ఆమె కాంస్య విగ్రహానికి పూల మాల వేసి, పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా మంత్రి ఐలమ్మ పోరాట స్ఫూర్తి ని గుర్తు చేసుకుంటూ, నినాదాలు చేశారు. 

మంత్రి ఎర్ర‌బెల్లి మాట్లాడుతూ.. తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, వీరనారీమణి చాకలి(చిట్యాల) ఐలమ్మ వర్ధంతి సందర్భంగా వారికి పుష్పాంజలి ఘ‌టిస్తూ.. చాకలి ఐలమ్మ జయంతి, వర్ధంతి లను ప్రభుత్వ పరంగా నిర్వహిస్తున్నందుకు సీఎం కేసీఆర్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ వీర వనిత, ధైర్య శాలి చాకలి(చిట్యాల) ఐలమ్మ.. అనాడు నిరంకుశ నిజాం రజాకార్లను, దేశ్ ముఖులను ఎదుర్కొన్నదని అన్నారు. నిజాం పాలన, విస్నూరు దేశ్ ముఖ్ కి వ్యతిరేకంగా పోరాడిన యోధురాలైన ఐలమ్మ.. రాయపర్తి మండలం కిష్ట పురం లో 1895, సెప్టెంబర్ 26న జ‌న్మించార‌నీ, పాలకుర్తి కి చెందిన చిట్యాల నర్సయ్య తో పెండ్లి జరిగింద‌నీ, వారికి ఐదుగురు కొడుకులు, ఇద్దరు బిడ్డల సంతానమ‌ని తెలిపారు. 

Latest Videos

undefined

చాక‌లి ఐల‌మ్మ కుల వృత్తి జీవన ఆధారంగా బతికింది. అలాగే, మల్లంపల్లి కొండల రావు కు చెందిన  పాలకుర్తిలో ని భూమిని కౌలు కి తీసుకొంది. నాలుగు ఎకరాలు పంట‌ పండించింది. అయితే, ఆ సమయంలో స్థానిక పట్వారీ పొలంలో పనికి రాని ఐలమ్మ పై కమ్యూనిస్టుల లో చేరిందని ఆయన దేశ్ ముఖ్ కి ఫిర్యాదు చేశాడు. ఐలమ్మ సాగు చేసిన పొలాన్ని తన పేరున రాయించుకొని ఆ పొలం తనదేనని, ఆ పంట కూడా తనదేనని తన మనుషులను పంపించాడు. సంఘం సహాయంతో వాళ్ళని తిప్పి పంపిన ఐలమ్మ, కోర్టు లో కేసు వేసి, అనాడు పేరు మోసిన లాయర్ కొండా లక్ష్మణ్ బాపూజీ సహకారం తో గెలిచింది. నాడు సంగం గా పిలిచే, కమ్యూనిస్టుల తో చేయి కలిపి తన పొలాన్ని దేశ్ ముఖ్ గుండాల నుండి కాపాడుకుంది. వారు చేసిన ఆనాటి ఉద్యమమే, తెలంగాణ సాయుధ పోరాటానికి నాంది అయిందనీ, ఆ తర్వాత మలి దశ తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తిగా నిలిచింద‌ని మంత్రి అన్నారు.

చాకలి ఐలమ్మ ధైర్యం, తెగువ చూపుతూ ఆనాటి దేశ్ ముఖులు, రజాకార్ల గుండెల్లో భయం పుట్టించిందనీ, ఒకవైపు సాయుధ పోరాటం చేస్తూనే, మరోవైపు అమ్మ లాగా ఉద్యమకారులకు అన్నం పెట్టి ఆదరించిన మహనీయురాలని కొనియాడారు. ఐలమ్మ తన 90వ ఏట, 1985 సెప్టెంబర్ 10న పాలకుర్తిలో మరణించారు. ఐలమ్మ స్ఫూర్తి తోనే సీఎం కేసీఆర్ తెలంగాణ సాధించార‌నీ, అదే స్ఫూర్తి ని సీఎం కొనసాగిస్తున్నారని మంత్రి ఎర్ర‌బెల్లి అన్నారు. ప‌రిపాలన లో ఉద్యమ స్ఫూర్తిని పాటిస్తున్నార‌నీ, అందుకే తెలంగాణ అన్ని రంగాల్లో అగ్రగామిగా ముందుకు సాగుతున్న‌ద‌ని తెలిపారు.

జోహార్ చాకలి ఐలమ్మ .. :  మంత్రి వేముల‌

చాకలి(చిట్యాల) ఐలమ్మ వర్థంతి సందర్భంగా వేల్పూర్ మండల కేంద్రంలో చాక‌లి ఐల‌మ్మ‌ విగ్రహానికి రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. జోహార్ చాకలి ఐలమ్మ అని నినదించారు. వెట్టి చాకిరికి వ్యతిరేకంగా,బానిస సంకెళ్ళ విముక్తి కోసం పోరాడిన తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, ధీర వనిత చాకలి ఐలమ్మ అని మంత్రి వేముల కొనియాడారు. సబ్బండ వర్గాల ఆత్మగౌరవానికి, మహిళా చైతన్యానికి ప్రతీక చాకలి ఐలమ్మ అని అన్నారు. మంత్రి వెంట నివాళులు అర్పించిన వారిలో నిజామాబాద్ డీసీసీబీ వైస్ చైర్మన్ రమేష్ రెడ్డి,రైతు నాయకుడు కోటపాటి నర్సింహనాయుడు,పలువురు రజక నాయకులు,స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

click me!