
రెండేళ్లకోసారి జరిగే అతి పెద్ద పండుగ మేడారం మహా జాతరకు (Medaram maha jatara) కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయనుంది. మేడారం జాతరకు నిధుల విడుదలకు కేంద్రం ఆమోదం తెలిపింది. మేడారం జాతరకు రూ. 2.5 కోట్లు విడుదల చేస్తున్నట్టుగా కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) వెల్లడించారు.మేడారం జాతరకు కేంద్ర ప్రభుత్వం అన్ని విధాల సహకరిస్తుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. గిరిజనులకు గుర్తింపునిచ్చేందుకు, జనాభాలో సుమారు 10 శాతం ఉన్న గిరిజన జాతుల వారసత్వం, సంస్కృతి పరిరక్షణకు కేంద్రం కట్టుబడి ఉన్నట్లు తెలిపారు.
స్వదేశ్ దర్శన్ పథకం క్రింద, పర్యా టక మంత్రిత్వ శాఖ గిరిజన సర్క్యూట్ల అభివృద్ధిలో భాగంగా 2016-17 లోనే దాదాపు 80 కోట్లరూపాయలతో ములుగు - లక్నవరం -మేడవరం -తాడ్వా యి- దామరవి - మల్లూర్ - బోగత జలపాతాలలో సమగ్ర అభివృద్ధిని చేపట్టడం జరిగిందని అన్నా రు. అందులోభాగంగా మేడారంలో అతిథి గృహాన్ని, ఓపెన్ ఆడిటోరియం, పర్యా టకుల కోసం విడిది గృహాలు, త్రాగునీరు వంటి వివిధ సౌకర్యా లు, సోలార్ లైట్లు వంటి వాటిని ఏర్పాటు చేసినట్టుగా చెప్పారు.
ఇక, ఆసియా ఖండంలోనే అతిపెద్దదైన మేడారం సమ్మక్క, సారలమ్మ జాతరను ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి మాఘ పౌర్ణమి రోజుల్లో జరుపుతారు. ఈ సంవత్సరం కూడా ఫిబ్రవరి 16 నుండి 19వ తేదీ వరకు జర గబోతున్న ఈ జాతరకు కోటి యాభై లక్షలకు పైగా భక్తులు వస్తారని ఒక అంచనా.
ఇంతటి ప్రాముఖ్యత ఉన్న మేడారం జాతరను.. జాతీయ పండుగగా ప్రకటించాలని తెలంగాణ ప్రభుత్వం కేంద్రాన్ని కోరుతున్న సంగతి తెలిసిందే. మేడారం జాతరకు జాతీయ హోదా తెచ్చి, ప్రత్యేక నిధులు కేటాయించాలని కోరుతున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ తరఫున మంత్రులు, ప్రజాప్రతినిధులు పలు సందర్భాల్లో కేంద్రానికి లేఖలు రాయడం, వినతిపత్రాలు అందజేయడం జరిగింది. అయితే తాజాగా మేడారం సమ్మక్క- సారలమ్మ జాతరకు నిధులు విడుదల చేసేందుకు కేంద్రం అంగీకారం తెలిపింది.
ఇక, తెలంగా ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైన తర్వాత మేడారం మహా జాతరకు నిధుల కేటాయింపు భారీగా పెరిగింది. రెండేళ్లకోసారి జరిగే వన జాతరకు ప్రభుత్వం తెలంగాణ సర్కార్ నిధులను విడుదల చేస్తూ వస్తుంది. ఈ ఏడాది మేడారం సమ్మక్క సారలమ్మ జాతర -2022 నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 75 కోట్లు విడుదల చేసింది.