
రాహుల్ గాంధీపై (rahul gandhi) అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ (himanta biswa sarma) చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. దీనిపై దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు (congress party) ఆందోళన నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (revanth reddy) మాట్లాడుతూ.. అస్సాం సీఎం బిశ్వ శర్మను బర్తరఫ్ చేయాలని, క్రిమినల్ కేసులు పెట్టి కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అంతకుముందు జరిగిన పీసీసీ సమావేశంలో బిశ్వ శర్మను బర్తరఫ్ చేయాలని తీర్మానం చేసినట్లు చెప్పారు. రేపు తెలంగాణలోని అన్ని పోలీస్ స్టేషన్‌లలో అస్సాం సీఎంపై ఫిద్యాదు చేస్తామని రేవంత్ రెడ్డి అన్నారు. అస్సాం సీఎం దిగజారి మాట్లాడినా బీజేపీ కనీసం ఖండించలేదని ఆయన ఎద్దేవా చేశారు. కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఎందుకు స్పందించలేదన్నారు.
మాతృత్వాన్ని అమానించే వ్యాఖ్యలు చేశారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. అలాంటి సంస్కార హీనమైన చర్చ చేయాలని కాంగ్రెస్ పార్టీ అనుకోవడం లేదని .. బీజేపీ నేతలకు తల్లులు లేరా అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అస్సాం సీఎం డీఎన్‌ఏ ఏమిటో చెప్పాలని అడిగారు. బిశ్వ శర్మ డీఎన్‌ఏ చైనాదా..? అస్సాందా? అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బిశ్వ శర్మ చేసిన వ్యాఖ్యలు.. కాంగ్రెస్ పార్టీని, రాహుల్ గాంధీని అవమానించడం కాదని.. మాతృత్వాన్ని అవమానించడమేనని రేవంత్ అన్నారు.
ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు రేవంత్ రెడ్డి. మళ్లీ కేసీఆర్.. కాంగ్రెస్‌కు దగ్గరవుతున్నారా? అని మీడియా ప్రశ్నించింది. దీనికి రేవంత్ రెడ్డి బదులిస్తూ.. మోసగాడికి బ్రాండ్ అంబసిడర్ కేసీఆర్ అన్న ఆయన.. టీఆర్ఎస్ చీఫ్‌ను కాంగ్రెస్ రెండు సార్లు నమ్మి మోసపోయిందని.. మళ్లీ కేసీఆర్‌ని నమ్మి మోసపోమన్నారు. ఇదే సమయంలో బీజేపీ, టీఆర్ఎస్‌పైనా మండిపడ్డారు రేవంత్.
ఒకరి దొంగతనం గురించి మరొకరి దగ్గర ఆధారాలు ఉన్నాయని చెబుతున్నారని.. ఎవరైనా బయట పెట్టారా..? అని ప్రశ్నించారు. బీజేపీ, టీఆర్ఎస్ తెలంగాణ సమాజాన్ని మభ్య పెట్టాలని చూస్తున్నాయన్న రేవంత్ ఆరోపించారు. కేంద్రంలో అవినీతి బయట పెడతా అంటే ఎవరు వద్దన్నారని కేసీఆర్‌ను ప్రశ్నించారు. ఇద్దరూ తోడు దొంగలేనని.. ఒకరినొకరు బ్లాక్ మెయిల్ చేసుకుని బతకాలని చూస్తున్నారని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. బీజేపీ, టీఆర్ఎస్ మాకు సమాన దూరమని.. మా ఇంటి కాకి కేసీఆర్ ఇంటి మీద వాలదు.. వాలింది అంటే కాల్చి పడేస్తాం అంటూ రేవంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు .
ప్రతి ఒక్కరు తల్లి ఉందే కాబట్టే పిల్లలుగా పుట్టారని.. ఇలాంటి వ్యాఖ్యలు విష సంస్కృతిని ప్రోత్సహించే విధంగా ఉందన్నారు. ఇలాంటి విష సంస్కృతిని ప్రదర్శించిన వాళ్లను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. దీనిపై ఇప్పటివరకు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా ఎవరూ కూడా స్పందించకపోవడం దారుణం అన్నారు. వాళ్లంతా అస్సాం సీఎం మాటలను సమర్ధిస్తున్నారా అని ప్రశ్నించారు. ఇలాంటి విష సంస్కృతిని సహించే ప్రసక్తే లేదన్నారు.