తెలంగాణ ముందస్తు ఎన్నికలు: కలెక్టర్ కొంపముంచిన ఈవీఎంల వివాదం

By Nagaraju penumalaFirst Published Feb 9, 2019, 5:03 PM IST
Highlights


దీంతో శనివారం కేంద్ర ఎన్నికల సంఘం వికారాబాద్ జిల్లా కలెక్టర్ ఒమర్ జలీల్ ను సస్పెండ్ చెయ్యాలంటూ తెలంగాణ ప్రభుత్వానికి ఆదేశాలు పంపింది. కలెక్టర్‌ ఒమర్‌ జలీల్‌ను సస్పెండ్‌ చేయడంతో పాటు, తదుపరి విచారణ చేపట్టాలని కేంద్ర ఎన్నికల సంఘం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. 

వికారాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో ఈవీఎంల వివాదం ఒక ఐఏఎస్ అధికారి మెడకు చుట్టుకుంది. ఈవీఎంలను తెరవకూడదనే హైకోర్టులో పిటీషన్ వేసినా వికారాబాద్ క లెక్టర్ ఒమర్ జలీల్ పట్టించుకోకుండా కోర్టు ఆదేశాలను సైతం పక్కనపెట్టి తెరిచారని ఆరోపిస్తూ కాంగ్రెస్ పార్టీ నేతలు ఫిర్యాదు చేశారు. 

వికారాబాద్ నియోజకవర్గ ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ మాజీ మంత్రి కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం ప్రసాద్, మర్రి శశిధర్ రెడ్డిలు హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో వికారాబాద్ నియోజకవర్గ ఎన్నికకు సంబంధించి హైకోర్టులో పిటీషన్ ఉందని, ఈవీఎం, వీవీ ప్యాట్ యంత్రాలను తెర వద్దని రాష్ట్ర ఎన్నికల అధికారి కార్యాలయం నుంచి వికారాబాద్ కలెక్టర్ కార్యాలయానికి సమాచారం పంపింది. 

అయితే వికారాబాద్‌ జిల్లా కలెక్టర్‌ ఒమర్‌ జలీల్‌ ఎన్నికపై కోర్టులో పిటిషన్‌ ఉన్నప్పటికీ ఈవీఎం, వీవీప్యాట్‌ యంత్రాలు తెరిచారు. దీంతో పలువురు కాంగ్రెస్ నేతలు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారితోపాటు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి ఫిర్యాదు చేశారు. 

కాంగ్రెస్ నేతల ఫిర్యాదుపై స్పందించిన కలెక్టర్ జలీల్ హైకోర్టులో ఎన్నికల పిటిషన్‌ ఉందన్న సమాచారం తనకు తెలియదని, ఉద్దేశపూర్వకంగా ఎలాంటి తప్పు చేయలేదని వివరణ ఇచ్చారు. కలెక్టర్‌ వివరణతో కేంద్ర ఎన్నికల సంఘం సంతృప్తి చెందలేదు. 

దీంతో శనివారం కేంద్ర ఎన్నికల సంఘం వికారాబాద్ జిల్లా కలెక్టర్ ఒమర్ జలీల్ ను సస్పెండ్ చెయ్యాలంటూ తెలంగాణ ప్రభుత్వానికి ఆదేశాలు పంపింది. కలెక్టర్‌ ఒమర్‌ జలీల్‌ను సస్పెండ్‌ చేయడంతో పాటు, తదుపరి విచారణ చేపట్టాలని కేంద్ర ఎన్నికల సంఘం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. 

సాయంత్రం లోపు సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చెయ్యాలని ఆదేశించింది. తెలంగాణ ముందస్తు ఎన్నికలు ముగిసి మూడు నెలలు కావస్తున్నా ఇప్పుడు కలెక్టర్ పై వేటు వెయ్యాలని ఈసీ ఆదేశించిండం చర్చనీయాంశంగా మారింది.  

click me!