
హైదరాబాద్: తెలంగాణలోని ఓ గ్రామంలో దళితులపై వివక్ష చూపుతూ.. ఊరి మురికి నీటి కాలువను ఓ దళితుడి పొలంలోకి వదిలారు. ఎంత వద్దని వారించినా వినలేదు. ఇటే వంపు ఉన్నదని, నీరు సహజంగా ఇటే వస్తుందనే సాకు చెప్పారు. కానీ, మరిన్ని ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నప్పటికీ కావాలనే తమపై వివక్ష చూపుతున్నారని ఆ కుటుంబం ఆరోపిస్తున్నది. ఈ ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో చోటుచేసుకుంది.
మల్హర్రావు మండలం, ఎడ్లపల్లి గ్రామానికి చెందిన గుర్రం లింగయ్య, మరికొందరి పొలాల్లో ఊరి మురికి నీరు ఏరులై పారుతున్నది. ఈ దుస్థితిని వివరిస్తూ వారు అధికారులను ఆశ్రయించినా ఫలితం లేకపోయింది. లింగయ్య కుమారుడు గుర్రం అశోక్ మాట్లాడుతూ, ఊరిలోని సుమారు 400 నుంచి 500 కుటుంబాల నివాసాల నుంచి వచ్చే మురికి నీరు ఊరి శివారులోని చెరువులోకి పంపేలా మెయిన్ లైన్‌ను వాస్తవంగా ప్రతిపాదించారని వివరించాడు. ఎస్సీ సామాజిక వర్గాలకు చెందిన ఇళ్ల నుంచి వెలువడే మురికి నీటిని మరో లైన్ ద్వారా ఈ ప్రధాన మెయిన్ లైన్‌కు కలపాలని నిర్ణయించారని తెలిపాడు. కానీ, ఇక్కడే వారు కుయుక్తులు పన్నారని, ఊరి దేవత గుడిని పేర్కొంటూ ఈ ప్రతిపాదనను మార్చారని చెప్పాడు. నిజానికి ఆ గుడిని తాకకుండానే పక్క నుంచి డ్రైనేజ్ కెనాల్ వెళ్తుందని వివరించాడు. వారికి తమ ఇళ్ల నుంచి వెళ్లే డ్రైనేజీ లైన్‌ను ప్రధాన లైన్‌కు కలపాలని లేదని, అందుకే ఆ లైన్‌ను మార్చడంతో మురికి నీరు ఇప్పుడు తమ పొలాల్లోకి వస్తున్నదని ఆరోపించాడు. ఆ ఊరి సర్పంచ్ (దళితుడే) మరికొందరు అధికారులు, స్థానిక నేతలతో కలిసి ఈ వివక్షకు పాల్పడుతున్నాడని అన్నాడు. గత రెండు నెలలుగా తమకు న్యాయం చేస్తామని చెప్పిన అదనపు కలెక్టర్.. ఇప్పుడు స్థానిక నేతలకు వంతపాడుతున్నారని బాధితులు ఆవేదన చెందారు.
ఇందుకు సంబంధించి తాము పలుమార్లు అధికారుల ముందు లేవనెత్తినా పట్టించుకోకుండా జీవనాధారమైన తమ భూమిలోకి డ్రైనేజీ నీటిని మళ్లించారని అశోక్ పేర్కొన్నాడు. ఈ విషయమై తమతోపాటు ఈ మురుగు నీటి కారణంగా బాధపడే ఇంకొందరు కలిసి అదనపు కలెక్టర్ టీఎస్ దివాకరను కలిశామని చెప్పాడు. అనంతరం, ఫీల్డ్ పరిశీలన కూడా జరిగిందని పేర్కొన్నాడు. వంపు అటువైపే ఉన్నదని, అందుకే మురికి నీరు అటువైపు వస్తున్నదని, అందులో వివక్ష ఏమీ లేదని, ఆ నీటి మళ్లింపు కోసం కొత్త కెనాల్ నిర్మించడం అధిక వ్యయం అవుతుందని అడిషనల్ కలెక్టర్ పేర్కొన్నట్టు వివరించాడు.
అయితే, ఆ మురుగు నీరు లింగయ్య పొలంలోకి వెళ్లకుండా అక్కడే ఓ డైవర్షన్ నిర్మిస్తామని చెప్పినా వారు అంగీకరించట్లేదని అదనపు కలెక్టర్ చెప్పారు. అయితే, ఈ వాదనలను బాధితుడు లింగయ్య కొడుకు అశోక్ అంగీకరించలేదు. మురికి నీరు చెరువులోకి వెళ్లడానికి తమ పొలమే కాకుండా సహజమైన వంపు గల ప్రత్యామ్నాయాలు ఎనిమిది ఉన్నాయని అన్నాడు. తాము నిరసిస్తున్నా డైవర్షన్ చేశారని, అయినా, ఒక ప్రైవేటు భూమిలోకి ఊరి మురికి నీరును ఎలా వదులుతారని ఆయన ప్రశ్నిస్తున్నాడు.