CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డికి ఎదురుదెబ్బ.. ఓటుకు నోటు కేసులో సుప్రీంకోర్టు నోటీసులు..

By Rajesh Karampoori  |  First Published Feb 10, 2024, 3:23 AM IST

CM Revanth Reddy:తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఓటుకు నోటు కేసులో క్రిమినల్‌ విచారణను తెలంగాణ నుంచి మార్చాలంటూ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై స్పందిస్తూ తెలంగాణ ముఖ్యమంత్రి ఎ రేవంత్‌రెడ్డి తదితరులకు సుప్రీంకోర్టు శుక్రవారం నోటీసులు జారీ చేసింది .


CM Revanth Reddy: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఓటుకు నోటు కేసు విచారణలో భాగంగా ఆయనకు అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. 2015లో ఓటుకు నోటు కేసులో క్రిమినల్‌ విచారణను తెలంగాణ నుంచి మార్చాలంటూ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు.

ఈ పిటిషన్‌పై స్పందిస్తూ తెలంగాణ ముఖ్యమంత్రి ఎ రేవంత్‌రెడ్డి తదితరులకు సుప్రీంకోర్టు శుక్రవారం నోటీసులు జారీ చేసింది . ఈ పిటిషన్‌పై జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ సందీప్ మోహతా బెంచ్ శుక్రవారం విచారణ చేపట్టింది. ఈ నేపథ్యంలో ఈ కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న రేవంత్‌ రెడ్డితో పాటు తెలంగాణ ప్రభుత్వం, ఇతర ప్రతివాదులకు ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. 

Latest Videos

ఈ నోటీసులపై నాలుగు వారాల్లో స్పందించాలని పేర్కొంది. పిటిషనర్ల తరఫు న్యాయవాది సిద్ధార్థ్ దవే వాదిస్తూ.. రేవంత్ రెడ్డి ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్నందున తెలంగాణలో న్యాయమైన విచారణ జరుగుతుందని తాము ఆశించలేమని వాదించారు. అలాగే హోం మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్నారని పిటిషనర్ తరపు న్యాయవాది ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. దీంతో ఈ కేసులో విచారణపై ప్రభావం చూపే అవకాశముందని తెలిపారు. 

ప్రస్తుత బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డితో పాటు మరో ముగ్గురు కేసును స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా విచారించేందుకు తెలంగాణ వెలుపలికి బదిలీ చేయాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌పై ఈ నోటీసులు జారీ అయ్యాయి. పిటిషనర్లు రేవంత్ రెడ్డిపై ఇప్పటివరకు 88 కేసులు నమోదయ్యాయని కూడా గుర్తు చేశారు. ఓటుకు నోటు కేసులో ట్రయల్‌ను నిలిపివేస్తూ గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ప్రస్తావించారు. అడ్వకేట్ ఆన్ రికార్డ్ పి మోహిత్ రావు ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు.

ఇంతకీ ఓటుకు ఓటు కేసేంటీ ? 

కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో (2015 మే 31న) తెలుగుదేశం పార్టీ (టీడీపీ) లో ఉన్న రేవంత్ రెడ్డి .. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్ధికి ఓటు వేయాలంటూ ఎమ్మెల్సీ ఎల్విస్ స్టీఫెన్‌సన్‌కు రూ.50 లక్షలు లంచం ఇస్తుండగా అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) కి పట్టుబడ్డాడు. శాసనమండలి ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా వేం నరేందర్‌రెడ్డి పోటీ చేశారు. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డిపై ఓటుకు నోటు కేసు నమోదైంది. దీంతో కొన్ని నెలల పాటు చంచల్ గూడ జైల్లో రేవంత్ శిక్ష అనుభవించారు.

అనంతరం హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో జైలు నుంచి విడుదలయ్యారు. ఈ కేసులో విచారణ జరిపేందుకు ప్రత్యేక ఏసీబీ కోర్టుకు ఉన్న అధికార పరిధిని ప్రశ్నిస్తూ తాను వేసిన పిటిషన్‌ను కొట్టివేసిన హైకోర్టు జూన్ 1, 2021 నాటి ఉత్తర్వులను సవాలు చేస్తూ రేవంత్ రెడ్డి దాఖలు చేసిన మరో పిటిషన్ సుప్రీంకోర్టులోని మరో ధర్మాసనం ముందు పెండింగ్‌లో ఉంది.

click me!