నా పేరు నరసింహ...

By pratap reddyFirst Published Oct 31, 2018, 12:53 PM IST
Highlights

మొదట్లో మోహన్ గారి కార్టూన్ స్టైల్ ని ఇమిటేట్ చేసినా పొలిటికల్ కార్టూన్ కు ఫొటో షాపు కలర్స్ అందం అద్దింది ముమ్మాటికీ నర్సింగారే.

ఇరవై ఐదేళ్ల క్రితం తెలుగు దినపత్రికల్లో వచ్చే పెద్ద కార్టూన్లు "ది బెస్ట్" కింద ఇండియా టుడే ఒక కార్టూన్ ని ఎంపిక చేసి రెండో పేజీ టాప్ లో వేసేది. అలా కొండకచో "నర్సిం" అని రాసుకునే పున్న నర్సింహ కార్టూన్లు అచ్చయితే ఛాతి ఎకరం అయ్యేది అని చెప్పేవాడు. అదే ఛాతిని ఇండియాటుడే పాతికేళ్లు కౌలుకు తీసుకుని దున్నేసింది. ఇండియా టుడేలో నర్సింగారు వేసిన ఇలస్ట్రేషన్లు, పోయెమ్స్ బొమ్మలు నిజంగా వండర్స్. తన కార్టూన్ల కంటే ఇలస్ట్రేషన్లపైనే నా దృష్టి ఎక్కువ. మొదట్లో మోహన్ గారి కార్టూన్ స్టైల్ ని ఇమిటేట్ చేసినా పొలిటికల్ కార్టూన్ కు ఫొటో షాపు కలర్స్ అందం అద్దింది ముమ్మాటికీ నర్సింగారే.

తెలుగు ఇండియా టుడే మూతబడడంతో చెన్నై నుంచి బయలుదేరి కాచిగుడాలో కాలు మోపి "నా పేరు నరసింహ... ఇంటి పేరు రణసింహ" అంటూ నవ తెలంగాణలో చేరి కుంచె ఝలిపించే పనిలో పడ్డాడు. గిలిగింతలు పెట్టే హాస్యం, శ్లేష సంబంధిత డైలాగుల చమత్కారం జోలికి పోకుండా సీరియస్ కార్టూన్ల మీదే తన ఫోకస్ వుంచడంతో మేధావి వర్గానికి తప్ప తగినంత మేధావేతర సామాన్య పాఠక ఫాలోయింగ్ పొందలేదనే చెప్పొచ్చు. 

ట్రాఫిక్, ఆటో చార్జీలు, వాతావరణ అసమతుల్యత... ఇత్యాది అంశాలపై  సదా అసహనం వ్యక్తం చేసే నర్సింగారికి తోటి మిత్రులు "మిస్టర్ కంప్లైంట్" అనే ట్యాగ్ తగిలించారు. అవును మరి కార్టూన్ అనబడే "ఆర్ట్ ఆఫ్ కంప్లైంట్"కు కావాల్సిన ట్యాగ్ అదేగా మరి.

ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుంచి పేపర్ ఆర్ట్ విభాగం కింద నర్సింగారికి ఉత్తమ కార్టూనిస్టు అవార్డు రావడంతో తెలుగు పొలిటికల్ కార్టూన్ బుగ్గలు సీఎంవైకేలో ఎరుపెక్కాయి. 

ఇక  తతిమ్మ పాట మేం పాడుతున్నాం..

సింగమల్లె నువ్వు శిఖరం చేరు
శిఖరం చేరి నింగిని కోరు...

ఇప్పుడు తన ఛాతి ఎన్ని ఎకరాలు విస్తరించిందో తనే చెప్పాలి!

- మృత్యుంజయ

click me!