నేడు తెలంగాణ బంద్..క్యాబ్ లు కూడా కష్టమే...

By telugu teamFirst Published Oct 19, 2019, 7:12 AM IST
Highlights

ఈ సమ్మెకు క్యాబ్ సర్వీసులు కూడా మద్దతు ఇవ్వడం గమనార్హం. హైదరాబాద్‌లో 50వేల క్యాబ్ సర్వీసులు, లక్ష దాకా ఆటోలున్నాయి. కాగా... ఈ రోజు ఇవన్నీ రోడ్డు మీద తిరిగే పరిస్థితి కూడా లేదు. కనీసం, ఆటోలు, క్యాబ్ లు కూడా తిరగకపోతే... ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడే అవకాశం ఉంది.

తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. నేటితో ఆర్టీసీ సమ్మె 15 రోజులకు చేరుకుంది. సమ్మెను తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో... నేడు బంద్ కి పిలుపునిచ్చారు. తెలంగాణ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చెయ్యాలనే డిమాండ్‌తోపాటూ... మరో 20కి పైగా డిమాండ్లతో సమ్మెకు దిగిన తెలంగాణ ఆర్టీసీ కార్మికులు... ఇవాళ బంద్ తలపెట్టారు. దీంతో... తెలంగాణ వ్యాప్తంగా బంద్ కొనసాగుతోంది. ఈ బంద్‌కు ప్రజలతోపాటూ... రాజకీయ పార్టీలు, విద్యార్థి, ఉద్యోగ సంఘాలు, ఉద్యమ సంఘాలు, సంస్థలు మద్దతు ఇచ్చాయి

ఈ సమ్మెకు క్యాబ్ సర్వీసులు కూడా మద్దతు ఇవ్వడం గమనార్హం. హైదరాబాద్‌లో 50వేల క్యాబ్ సర్వీసులు, లక్ష దాకా ఆటోలున్నాయి. కాగా... ఈ రోజు ఇవన్నీ రోడ్డు మీద తిరిగే పరిస్థితి కూడా లేదు. కనీసం, ఆటోలు, క్యాబ్ లు కూడా తిరగకపోతే... ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడే అవకాశం ఉంది.

15 రోజులుగా సమ్మె కొనసాగుతున్నా ప్రభుత్వం మాత్రం ఆర్టీసీ జేఏసీతో మరోసారి చర్చలు జరిపేందుకు సిద్ధంగా లేదు. శుక్రవారం హైకోర్టు చర్చలు జరపాలనీ, ఇవాళ 10న్నర లోపు చర్చలు మొదలవ్వాలని కోరింది. ప్రభుత్వం మాత్రం హైకోర్టు తమను ఆదేశించలేదనీ, సూచన మాత్రమే చేసిందని భావిస్తోంది. హైకోర్టు సూచనల్ని తప్పనిసరిగా పాటించాలని రూలేమీ లేదని భావిస్తున్న ప్రభుత్వం చర్చలు జరపాల్సిన అవసరం లేదని డిసైడైనట్లు తెలిసింది. అందువల్ల ఇవాళ చర్చలకు ఛాన్స్ లేదని అర్థమవుతోంది.

బంద్ దృష్ట్యా అప్రమత్తమైన ప్రభుత్వం ముందుగానే జిల్లాల్లో చాలా మంది నేతల్ని అదుపులోకి తీసుకుంది. శుక్రవారం రాత్రి నుంచే అరెస్టులు కొనసాగాయి. చాలా చోట్ల సీపీఎం, సీపీఐ నేతల ఇళ్లకు వెళ్లి మరీ నాయకుల్ని పోలీసులు పట్టుకుపోయారు. అటు పోలీస్ శాఖ కూడా విస్తృత ఏర్పాట్లు చేసింది. బంద్ సందర్భంగా ప్రభుత్వ ఆస్తులకు నష్టం, శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ఉండేలా డీజీపీ మహేందర్ రెడ్డి ముందస్తు ఆదేశాలు జారీ చేశారు.

తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం  తరహాలోనే  ఆర్టీసీ సమ్మె విషయంలో  కూడ తాము మరో ఉద్యమానికి సిద్దమౌతామని  బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ చెప్పారు.

శుక్రవారం నాడు  లక్ష్మణ్  బీజేపీ కార్యాలయంలో  మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వానికి అన్ని వర్గాల ప్రజలు, ప్రజా సంఘాలు, కుల సంఘాలు ఎదురు తిరిగాయని ఆయన ఆరోపించారు. నిన్నటి నుండి ఉబేర్, ఓలా కార్మికులు, ఉద్యోగులు అన్ని క్యాబ్ డ్రైవర్లు కూడ నిరవధిక సమ్మెకు మద్దతుగా నిలిచిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
 
అసలు రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా అనే అనుమానం కలుగుతోందని ఆయన చెప్పారు. ఆర్టీసీ సమ్మె ఉధృతంగా సాగుతోందన్నారు. రాష్ట్రంలో కార్యకలాపాలు స్థంభించిపోయాయన్నారు.

ఆర్టీసీ సమ్మె విషయంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు దారుణంగా ఉందన్నారు. ఆర్టీసీ సమ్మె విషయంలో  మంత్రి పువ్వాడ అజయ్ కుమార్  స్పందించకపోవడం బాధాకరమన్నారు. పాలన అటకెక్కించి కేవలం తన ప్రతిష్ట కోసం ప్రజల జీవితాలతో సీఎం కేసీఆర్ చెలగాటమాడుతున్నారని లక్ష్మణ్ విమర్శించారు.

రాష్ట్రంలో పాలన ఉందా అనే అనుమానం వస్తోందన్నారు. ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా ఈ నెల 19వ తేదీన తలపెట్టిన రాష్ట్ర బంద్ ను విజయవంతం చేయాలని  ఆయన ప్రజలను కోరారు.

ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా ఇప్పటికే రెండు దపాలు  బీజేపీ నేతలు రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ను కలిశారు. ఆర్టీసీ సమ్మె విషయమై ప్రభుత్వం అనుసరించిన విధానాలపై బీజేపీ నేతలు గుర్రుగా ఉన్నారు. ఇదే విషయమై గవర్నర్ కు ఫిర్యాదు చేశారు.

ఈ నెల 5వ తేదీ నుండి ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్నారు. సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులను సెల్ప్ డిస్మిస్ అయినట్టుగా ప్రభుత్వం ప్రకటించడంపై ఆర్టీసీ కార్మికులు ఆవేదనతో ఉన్నారు. ఇప్పటికే ఇద్దరు ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మరో ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.  

click me!