బీఆర్ఎస్ నుంచి పొంగులేటి, జూపల్లి సస్పెన్షన్.. కేసీఆర్ ఆదేశాలతో సంచలన నిర్ణయం..

Published : Apr 10, 2023, 10:28 AM ISTUpdated : Apr 10, 2023, 10:47 AM IST
బీఆర్ఎస్ నుంచి పొంగులేటి, జూపల్లి సస్పెన్షన్.. కేసీఆర్ ఆదేశాలతో సంచలన నిర్ణయం..

సారాంశం

బీఆర్ఎస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. బీఆర్ఎస్ నుంచి మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డిలను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. 

హైదరాబాద్: బీఆర్ఎస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. బీఆర్ఎస్ నుంచి మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డిలను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలను సస్పెండ్ చేసినట్టుగా బీఆర్‌ఎస్ పార్టీ తెలిపింది. బీఆర్ఎస్ జాతీయ అధ్యక్షుడు కేసీఆర్ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకుంది.  ఇక, జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలు గత కొంతకాలంగా బీఆర్ఎస్ పార్టీకి దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. 

గత కొంతకాలంగా పొంగులేటి  శ్రీనివాస్ రెడ్డి.. బీఆర్ఎస్ ప్రభుత్వంపై, కేసీఆర్‌‌పై విమర్శలు చేస్తున్నారు. ఉమ్మడి  ఖమ్మం జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. గత కొంతకాలంగా ఆయన పార్టీ మారతారనే ప్రచారం సాగుతుంది. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని పార్టీలో చేర్చుకునేందుకు కాంగ్రెస్, బీజేపీలు కూడా ప్రయత్నాలు చేసినట్టుగా తెలుస్తోంది. అయితే ఏ పార్టీలో చేరాలనే దానిపై తాను ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెబుతున్నారు. 

మరోవైపు కొల్లాపూర్ నియోజకవర్గానికి చెందిన జూపల్లి కృష్ణారావు.. గత కొంతకాలంగా బీఆర్ఎస్ అధిష్టానం తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గతంలో మంత్రిగా పనిచేసిన జూపల్లి.. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటి చేసిన బీరం హర్ష వర్దన్ రెడ్డి  చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత హర్షవర్దన్ రెడ్డి.. బీఆర్ఎస్ గూటికి చేరారు. ఈ క్రమంలోనే ఇరువురు నేతల మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. దీంతో హర్షవర్దన్ రెడ్డిపై, బీఆర్ఎస్ నాయకత్వంపై జూపల్లి  కృష్ణారావు విమర్శలు చేస్తున్నారు. అయితే ఈ సమస్యను పరిష్కరించడానికి బీఆర్ఎస్ అధినాయకత్వం చేసిన ప్రయత్నాలు కూడా ఫలించలేదు. 

ఇక, కొత్తగూడెంలో పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి నిర్వహించిన ఆత్మీయ సమావేశానికి జూపల్లి కృష్ణారావు కూడా హాజరయ్యారు. ఇరువురు నేతలు కూడా సీఎం కేసీఆర్ టార్గెట్‌గా విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలోనే పొంగులేటి, జూపల్లిలపై చర్యలు తీసుకోకుండా పార్టీ నష్టం జరిగే అవకాశం ఉందని.. క్యాడర్‌లోకి కూడా తప్పుడు సంకేతం వెళ్లే అవకాశం ఉందని భావించిన బీఆర్ఎస్ అధిష్టానం.. వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. 

PREV
click me!

Recommended Stories

Constable Recruitment 2025 : 48954 పోలీస్ జాబ్స్.. తెలుగులోనే పరీక్ష, తెలుగు రాష్ట్రాల్లోనే ఎగ్జామ్ సెంటర్
Hyderabad: యువ‌త త‌ల రాత మార్చేలా.. హైద‌రాబాద్‌లో గూగుల్ తొలి స్టార్ట‌ప్స్ హ‌బ్, దీని ఉప‌యోగం ఏంటంటే