
భారత రాష్ట్ర సమితితో జాతీయ రాజకీయాల్లోకి వెళ్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ క్రమంగా దూకుడు పెంచుతున్నారు. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో తొలి బహిరంగ సభ నిర్వహించేందుకు సిద్దమయ్యారు. ఖమ్మం వేదికగా ఈ నెల 18న బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించారు. బీఆర్ఎస్ తొలి బహిరంగ సభను ఢిల్లీలో నిర్వహించాలని భావించినప్పటికీ.. ఆ తర్వాత కేసీఆర్ తన నిర్ణయం మార్చుకున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుత రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఖమ్మంలో బహిరంగ సభను నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయం తీసుకనున్నట్టుగా సమాచారం.
ఈ నెల 18న సీఎం కేసీఆర్ ఖమ్మంలో సమీకృత కలెక్టరేట్ ప్రారంభోత్సవానికి వెళ్లనున్నారు. ఈ క్రమంలోనే అదే రోజు పట్టణంలో బహిరంగ సభ నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్టుగా సమాచారం. ఈ విషయంపై కేసీఆర్ ఇప్పటికే ఖమ్మం జిల్లాకు చెందిన కొందరు బీఆర్ఎస్ ముఖ్య నేతలతో చర్చించినట్టుగా తెలుస్తోంది. ఇక, ఖమ్మంలో నిర్వహించే బీఆర్ఎస్ బహిరంగ సభకు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్, కేరళ సీఎం పినరాయి విజయన్, యూపీ మాజీ సీఎం, సమాజ్‌వాద్ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్‌తో పాటు పులువురు నేతలను కేసీఆర్ ఆహ్వానించనున్నట్టుగా తెలుస్తోంది.
రాబోయే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఖమ్మంలో నిర్వహించబోయే ఈ బహిరంగ సభ ద్వారా పార్టీ క్యాడర్‌కు కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. అయితే కేసీఆర్ బీఆర్ఎస్ బహిరంగ సభకు ఖమ్మంను ఎంచుకోవడం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ పెద్దగా ప్రభావం చూపలేదనే చెప్పాలి. అయితే 2018 తర్వాత జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో మాత్రం టీఆర్ఎస్ మెరుగైన ఫలితాలను కనబరించింది. మరోవైపు ఇటీవల ఖమ్మం బీఆర్ఎస్‌లో కొందరు నేతలు వేర్వేరుగా తమ అనుచరులతో ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ పరిణామాల నేపథ్యంలో కేసీఆర్.. ఖమ్మంలో బీఆర్ఎస్ తొలి బహిరంగ సభను నిర్వహించాలని నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది.
అయితే ఖమ్మంలో బహిరంగ సభకు భారీ జనసమీకరణపై కూడా బీఆర్ఎస్ అధిష్టానం ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు సూర్యాపేట, నల్గొండ, మహబూబాబాద్, వరంగల్ జిల్లాల నుంచి బహిరంగ సభకు జనాలను తరలించాలని బీఆర్ఎస్ భావిస్తున్నట్టుగా తెలుస్తోంది.