ఢిల్లీ లిక్కర్ స్కాంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈడీ విచారణ ముగిసింది. ఆఫీస్ నుంచి బయటకొచ్చిన కవిత నేరుగా ఢిల్లీలోని తన తండ్రి, తెలంగాణ సీఎం కేసీఆర్ అధికారిక నివాసానికి బయల్దేరారు.
ఢిల్లీ లిక్కర్ స్కాంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈడీ విచారణ ముగిసింది. దాదాపు 9 గంటల పాటు ఈడీ అధికారులు ఆమెను ప్రశ్నించారు. ఈ నెల 16న మరోసారి తమ ఎదుట విచారణకు హాజరుకావాలని కవితను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఆదేశించింది. శనివారం ఉదయం నుంచి ఐదుగురు అధికారులతో కూడిన ఈడీ బృందం కవితపై పలు ప్రశ్నలు సంధించారు. వీరిలో ఒక జాయింట్ డైరెక్టర్, లేడీ డిప్యూటీ డైరెక్టర్, ముగ్గురు అసిస్టెంట్ డైరెక్టర్లు వున్నారు.
కాన్ఫన్‌ట్రేషన్ ఇంటరాగేషన్ పద్ధతిలో కవితను ఈడీ అధికారులు ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది. పీఎంఎల్ఏ సెక్షన్ 50 కింద కవితను పలు ప్రశ్నలు అడిగినట్లుగా తెలుస్తోంది. అలాగే ఆమె స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేసినట్లుగా తెలుస్తోంది. రామచంద్రపిళ్లై, కవితను ఎదురెదురుగా కూర్చోబెట్టి ప్రశ్నించింది ఈడీ. ఆఫీస్ నుంచి బయటకొచ్చిన కవిత నేరుగా ఢిల్లీలోని తన తండ్రి, తెలంగాణ సీఎం కేసీఆర్ అధికారిక నివాసానికి బయల్దేరారు.
ఇక, కవితకు మద్దతుగా కేటీఆర్, హరీష్ రావులతో పాటు పలువురు తెలంగాణ మంత్రులు, బీఆర్ఎస్ ముఖ్యనేతలు కూడా ఢిల్లీకి చేరుకున్న సంగతి తెలిసిందే. పెద్ద ఎత్తున బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా ఢిల్లీకి చేరుకుని కవితకు మద్దతుగా నిలిచారు.
ఇకపోతే.. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో గతంలో సీబీఐ అధికారులు కవితను సాక్షిగా విచారించిన సంగతి తెలిసిందే. అలాగే ఇప్పటివరకు దాఖలు చేసిన చార్జ్‌షీట్లలో కవిత పేరును పలు సందర్భాల్లో ప్రస్తావించాయి దర్యాప్తు సంస్థలు. తాజాగా ఈ కేసులో అరెస్ట్ చేసిన అరుణ్ రామచంద్ర పిళ్లైని న్యాయస్థానంలో హాజరుపరిచిన సందర్భంగా కూడా రిమాండ్ రిపోర్టులో కీలక అభియోగాలు మోపింది. కవిత బినామీనని పిళ్లై ఒప్పుకున్నట్లు ఈడీ తన రిమాండ్ రిపోర్టులో పేర్కొంది.
ఈ కేసులో అరెస్టయిన సమీర్ మహేంద్రుని ఇండోస్పిరిట్ గ్రూప్‌లో పిళ్లై కూడా భాగస్వామిగా ఉన్నారని.. ఎల్ 1 లైసెన్స్ ఉన్న ఇండో స్పిరిట్‌లో పిళ్లైకి 32.5 శాతం వాటా ఉండగా, ప్రేమ్ రాహుల్‌కు కూడా 32.5 శాతం వాటా ఉందని ఈడీ తెలిపింది. ప్రేమ్ రాహుల్, అరుణ్ రామచంద్ర పిళ్లైలు.. కవిత, వైఎస్ఆర్‌సీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఆయన కుమారుడు మాగుంట రాఘవరెడ్డిలకు బినామీలుగా ప్రాతినిధ్యం వహించారని ఈడీ తన నివేదికలో పేర్కొంది. భాగస్వామ్య సంస్థలో కవిత వ్యాపార ప్రయోజనాలకు పిళ్లై ప్రాతినిధ్యం వహిస్తున్నారని ఈడీ పేర్కొంది. దీని ఆధారంగా కవితకు ఈడీ సమన్లు జారీ చేసింది.
అయితే.. అరుణ్ రామచంద్ర పిళ్లై శుక్రవారం రౌస్ అవెన్యూ కోర్టులో ఈడీకి ఇచ్చిన వాంగ్మూలాన్ని ఉపసంహరించుకోవడానికి పిటిషన్ దాఖలు చేశారు. ఈడీకి ఇచ్చిన వాంగ్మూలం వెనక్కి తీసుకునేందుకు తనకు అనుమతి ఇవ్వాలని కోర్టును కోరారు. దీంతో కోర్టు ఈడీకి నోటీసులు జారీ చేసింది. పిళ్లై మార్చి 13 వరకు ఈడీ కస్టడీలో ఉండనున్న సంగతి తెలిసిందే.