జంపింగ్ లతో కేసీఆర్ బేజారు .... బిఆర్ఎస్ మిగిలేదిక కల్వకుంట్ల కుటుంబమేనా..!

By Arun Kumar P  |  First Published Jun 28, 2024, 8:07 PM IST

తెలంగాణ ఏర్పాటుతర్వాత వరుసగా పదేళ్లు అధికారాన్ని చలాయించిన పార్టీ పరిస్థితి అధ్వాన్నంగా మారింది. ఇప్పటికే ఓటమి బాధలో వున్న ఆ పార్టీని గెలిచిన ఎమ్మెల్యేలు సైతం వీడుతుండటం ఆందోళన కలిగిస్తోంది.  ఇప్పటివరకు బిఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలు ఎవరెవరంటే... 


హైదరాబాద్ : బిఆర్ఎస్ అంటే కేసీఆర్... కేసీఆర్ అంటే బిఆర్ఎస్. పార్టీ బలపడ్డా, బలహీనపడ్డా... అధికారంలోకి వచ్చినా, కోల్పోయినా... మంచయినా, చెడయినా అన్నింటికీ అతడే బాధ్యుడు. తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావం నుండి ఉద్యమం, రాష్ట్ర ఆవిర్భావం, రెండు సార్లు అధికారంలోకి తేవడం, చివరకు టిఆర్ఎస్ కాస్త బిఆర్ఎస్ (భారత రాష్ట్ర సమితి) గా మారడం, అధికారం కోల్పోవడం... ఇలా అన్నిట్లోనూ కేసీఆర్ దే కీలక పాత్ర. కేసీఆర్ తర్వాత ఆయన కుటుంబసభ్యులదే పార్టీలోనూ, పాలనలోనూ పెత్తనం. దీంతో బిఆర్ఎస్ పార్టీని కల్వకుంట్ల కుటుంబ పార్టీగా పేర్కొంటారు ప్రత్యర్థి పార్టీల నాయకులు. ఆ పార్టీలో ఎంత సీనియర్లయినా, ఎంతటి ప్రజాధరణ కలిగిన నాయకులైనా కేసీఆర్ సార్, కల్వకుంట్ల ఫ్యామిలీ చెప్పినట్లే నడుచుకోవాలి...  కాదని ఎదిరిస్తే మరుక్షణమే మాజీ బిఆర్ఎస్ నాయకులు అయ్యేవారు.     

తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ కు... ముఖ్యమంత్రి కేసీఆర్ కు చాలా తేడా వుందని ఆ పార్టీ నాయకులే చెబుతుండేవారు. ఉద్యమంలో ఏ నిర్ణయం తీసుకోవాలన్నా  అందరినీ సంప్రదించేవాడట... మెజారిటీ అభిప్రాయం మేరకే నిర్ణయాలు తీసుకునేవారట. కానీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతర్వాత కేసీఆర్ పూర్తిగా మారిపోయాడని... ముఖ్యమంత్రిగా ఏకచత్రాధిపత్యం కొనసాగిందని అంటున్నారు.గత పదేళ్ళపాటు అటు పార్టీలో, ఇటు ప్రభుత్వంలోనూ ఆయనే సుప్రీం... ఆయన చెప్పిందే వేదం అన్నట్ల‌ుగా పార్టీ, పాలన సాగింది.  

Latest Videos

undefined

అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ ఓటమి తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. అధికారాన్ని కోల్పోయిన కేసీఆర్ పరిస్థితి పూలు అమ్మినచోటే కట్టెలు అమ్మాల్సి వచ్చిందన్న సామెతలా తయారయ్యింది. ఒక్కసారి అధికారం చేజారగానే కేసీఆర్ కు షాక్ ల మీద షాక్ లు ఇస్తున్నారు బిఆర్ఎస్ నాయకులు. గతంలో కేసీఆర్ తో అత్యంత సన్నిహితంగా మెలిగినవారు సైతం ఆయనకు దూరం అవుతున్నారు. చివరకు గెలిచిన బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు సైతం కారు దిగి హస్తం గూటికి చేరుతున్నారు. 

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయంతో మంచి జోష్ మీదున్న కాంగ్రెస్ కేసీఆర్ ను చావుదెబ్బ తీయాలని చూస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక శ్రద్ద చూపించి బిఆర్ఎస్ నాయకుల కోసం ఆపరేషన్ ఆకర్ష్ చేపట్టారు. దీంతో బిఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లోకి భారీ వలసలు కొనసాగుతున్నాయి. ఎప్పుడూ కేసీఆర్ తో వుండే సీనియర్లు కేశవరావు, పోచారం, శ్రీనివాస్ రెడ్డి, కడియం శ్రీహరి వంటివారే బిఆర్ఎస్ ను వీడారంటే ఆ పార్టీ పరిస్థితి ఎంత దారుణంగా వుందో  అర్థం చేసుకోవచ్చు.  

ఇప్పటివరకు బిఆర్ఎస్ ను వీడిన నాయకులు వీరే..: 

కేశవరావు, ఆయన కూతురు విజయలక్ష్మి : 

బిఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ కుటుంబసభ్యులు కాకుండా ఇంకెవరికైనా తగిన గుర్తింపు దక్కిందంటే అది కె. కేశవరావుకే. ఆయనను రెండుసార్లు రాజ్యసభకు పంపించి ఎంపీని చేసారు... పెద్దల సభలో బిఆర్ఎస్ పక్ష నేతగా చేసారు కేసీఆర్. అంతేకాదు ఆయన కూతురు గద్వాల విజయలక్ష్మిని హైదరాబాద్ మేయర్ గా చేసారు కేసీఆర్. ఇలా పదవులే కాదు ఎప్పుడూ తనవెంటే వుంచుకుంటూ ఎవరికీ ఇవని గౌరవం ఇచ్చారు కేసీఆర్. ఇలా అధికారం వున్నంతకాలం కేసీఆర్ వెన్నంటివున్న కేశవరావు బిఆర్ఎస్ ఓడిపోగానే కూతురితో కలిసి కాంగ్రెస్ లో చేరారు. 

కడియం శ్రీహరి, ఆయన కూతురు కావ్య :

లోక్ సభ ఎంపీగా వున్న కడియంను తీసుకువచ్చి అనూహ్యంగా డిప్యూటీ సీఎంను చేసారు కేసీఆర్. ఆయనతో ఎంపీ పదవికి రాజీనామా చేయించి ఎమ్మెల్సీని చేసిమరి తన కేబినెట్ లోకి తీసుకున్నారు. ఆ తర్వాత కూడా కడియంకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో రాజయ్యను కాదని కడియంకు స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే సీటిచ్చి గెలిపించారు. ఆ తర్వాత వరంగల్ ఎంపీ అభ్యర్థిగా ఆయన కూతుర్ని కావ్యకు సీటిచ్చారు. కానీ ఇవన్ని మరిచిన కడియం శ్రీహరి కూతురికి ఎంపీ సీటును తిరస్కరించి కాంగ్రెస్ లో చేరారు. కాంగ్రెస్ తరపున కూతురు కావ్యను వరంగల్ లోక్ సభ బరిలో నిలిపి  గెలిపించుకున్నారు. 

పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఆయన కొడుకు భాస్కర్ రెడ్డి : 

కేసీఆర్ కు అంత్యంత సన్నిహితుడిగా పేరున్న పోచారం శ్రీనివాస్ రెడ్డి కూడా ఇటీవల కాంగ్రెస్ లో చేరారు. కొడుకు భాస్కర్ రెడ్డితో కలిసి సీఎం రేవంత్ సమక్షంలో ఆయన కాంగ్రెస్ లో చేరారు. గతంలో కేసీఆర్ కేబినెట్ లో వ్యవసాయ శాఖ మంత్రిగా, ఆ తర్వాత అసెంబ్లీ స్పీకర్ గా వ్యవహరించారు పోచారం. ఇలా బిఆర్ఎస్ అధికారంలో వుండగా కీలక పదవులు అనుభవించిన ఆయన అధికారాన్ని కోల్పోగానే కాంగ్రెస్ లో చేరారు.

అయితే పైన పేర్కొన్న ముగ్గురు నాయకులు తమ బిడ్డల రాజకీయ భవిష్యత్ కోసమే బిఆర్ఎస్ ను వీడినట్లు తెలుస్తోంది. ఇప్పటికే కడియం కావ్య ఎంపీ కాగా,  కాంగ్రెస్ లో చేరిన విజయలక్ష్మి మేయర్ గా కొనసాగుతున్నారు. ఇక పోచారం భాస్కర్ రెడ్డికి కూడా తగిన గుర్తింపు ఇస్తామని సీఎం రేవంత్ హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.  

దానం నాగేందర్ : 

అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ తరపున పోటీచేసి గెలిచారు దానం నాగేందర్. కానీ లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున సికింద్రాబాద్ ఎంపీగా పోటీచేసారు. లోక్ సభ ఎన్నికలకు ముందు అనూహ్యంగా బిఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరిన ఈ ఎమ్మెల్యే కాస్త ఎంపీ అభ్యర్థిగా మారిపోయారు. 

తెల్లం వెంకట్రావు : 

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బిఆర్ఎస్ పార్టీ తరపున గెలిచింది ఒకే ఒక ఎమ్మెల్యే. ఆయన కూడా ఆ పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరారు. భద్రాచలం అసెంబ్లీకి బిఆర్ఎస్ తరపున పోటీచేసిన ఆయన గెలిచిన తర్వాత కాంగ్రెస్ లో చేరారు.  

జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ : 

ఇటీవలే బిఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్ లో చేరారు. అయితే ఈ చేరిక వ్యవహారం వివాదాస్పదంగా మారింది. జగిత్యాల ఎమ్మెల్యేను స్ధానిక నేత జీవన్ రెడ్డికి తెలియకుండానే కాంగ్రెస్ లో చేర్చుకోవడంతో అలజడి రేగింది. సీఎం రేవంత్ రెడ్డి ఏకపక్ష నిర్ణయంతో మనస్తాపానికి గురయిన జీవన్ రెడ్డి పార్టీ మారతారని... రాజకీయాలకు దూరం అవుతారని ప్రచారం జరిగింది. కానీ స్వయంగా సీఎం రేవంత్ ఆయనను బుజ్జగించడంతో వెనక్కి తగ్గారు.  

కాలే యాదయ్య : 

బిఆర్ఎస్ పార్టీకి తాజాగా మరో ఎమ్మెల్యే షాకిచ్చారు. చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య బిఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయనకు కండువా కప్పి పార్టీలో చేర్చుకున్నారు. 

ఇలా ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడి అధికారాన్ని కోల్పోయిన బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల జంపింగ్ తో మరింత బలహీనపడింది. ఇదే సమయంలో ఎమ్మెల్యేల చేరికతో కాంగ్రెస్ మరింత బలపడుతోంది. ప్రస్తుత పరిస్థితిని చూస్తే బిఆర్ఎస్ లో ఎవరూ మిగిలేలా కనిపించడం లేదని... కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ముగ్గురే మిగిలేలా వున్నారంటూ ప్రత్యర్థులు సెటైర్లు వేస్తున్నారు. 

click me!