ఎమ్మెల్యేల ప్రలోభాల కేసు.. సీబీఐకి హైకోర్టు కీలక ఆదేశాలు, విచారణ సోమవారానికి వాయిదా

By Siva KodatiFirst Published Jan 6, 2023, 4:19 PM IST
Highlights

ఎమ్మెల్యేల ప్రలోభాల కేసును సీబీఐకి అప్పగించడాన్ని సవాల్ చేస్తూ  తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ పై విచారణను హైకోర్ట్ సోమవారానికి వాయిదా వేసింది.
 

ఎమ్మెల్యేల ప్రలోభాల కేసును సీబీఐకి అప్పగించడాన్ని సవాల్ చేస్తూ  తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ పై విచారణను హైకోర్ట్ సోమవారానికి వాయిదా వేసింది.దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసు విచారణ సందర్భంగా తెలంగాణ హైకోర్టులో వాడివేడిగా వాదనలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా బీజేపీ తరపున లాయర్ దామోదర్ రెడ్డి వాదనలు వినిపించారు. బీజేపీ ఏ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చలేదని, ఏ ఎమ్మెల్యేనూ కొనుగోలు చేయలేదని ఆయన తెలిపారు. 2014 నుంచి 37 మంది ఎమ్మెల్యేలను బీఆర్ఎస్‌లో చేర్చుకున్నారు దామోదర్ రెడ్డి కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇతర పార్టీల ఎమ్మెల్యేలు బీఆర్ఎస్‌లో చేరాలని కేసీఆర్ ఓపెన్ స్టేట్‌మెంట్ ఇచ్చారని దామోదర్ రెడ్డి వాదించారు. 

ఇకపోతే.. ఎమ్మెల్యేల కొనుగోలు కేసును సీబీఐకి అప్పగిస్తూ సింగిల్ జడ్జి తీర్పును తెలంగాణ ప్రభుత్వం సవాల్ చేసిన సంగతి తెలిసిందే. దీనిని విచారణకు స్వీకరించిన కోర్ట్.. ప్రభుత్వ వాదనలు విన్నది. రాష్ట్ర ప్రభుత్వం తరపున దుష్యంత్ దవే వాదనలు వినిపించారు. ప్రభుత్వ ఎమ్మెల్యేలను కొనాలని చూసినప్పుడు పార్టీ అధ్యక్షుడిగా కేసీఆర్ ప్రెస్‌మీట్ పెట్టడంలో తప్పేంటని ఆయన కోర్టుకు వివరించారు. కోర్టుకు నివేదిక అందజేసిన తర్వాత అది పబ్లిక్ డొమైన్‌లోకి వస్తుందని.. ప్రజాక్షేత్రంలోకి ఎవిడెన్స్ వచ్చిన తర్వాతనే కేసీఆర్ ప్రెస్‌మీట్ పెట్టి వివరాలు తెలిపారని దవే వాదనలు వినిపించారు. అయితే ప్రతివాదుల తరపు వాదనలు ఈరోజు కొనసాగుతున్నాయి. 

సీబీఐ తరపు న్యాయవాదులు వాదిస్తూ. .. కేసు వివరాలన్నీ ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాశామని హైకోర్టుకు తెలిపారు. హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చినా మాకెలాంటి డాక్యుమెంట్లు ఇవ్వడం లేదని తెలిపారు. డాక్యుమెంట్లు ఇస్తేనే విచారణ మొదలెడతామని సీబీఐ తరపు న్యాయవాదులు హైకోర్టును కోరారు. దీంతో జోక్యం చేసుకున్న న్యాయస్థానం.. డివిజన్ బెంచ్‌లో విచారణ పూర్తయ్యే వరకు ఆగాలని సీబీఐని ఆదేశించింది. సీబీఐ వాదన కూడా వింటామన్న కోర్ట్.. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది. 
 

click me!