పార్టీ కార్యకర్తల గురించి మాట్లాడకపోతే తాము డమ్మీ ఎమ్మెల్యేలు అవుతామని మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు చెప్పారు.
హైదరాబాద్: తమ నియోజకవర్గాల్లో ఏం జరుగుతుందో సీఎంకు తెలవాల్సిన అవసరం ఉందని మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు చెప్పారు. సోమవారంనాడు సాయంత్రం మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు మీడియాతో మాట్లాడారు.జిల్లాలో సమస్యకు మంత్రి మల్లారెడ్డే కారణమన్నారు. తన నియోజకవర్గానికే పదవులుంటే సరిపోతుందని మల్లారెడ్డి భావిస్తున్నారని ఆయన చెప్పారు. మేడ్చల్ లో కూడా సీనియర్లకు , అర్హులకు పదవులను ఇవ్వలేదని మంత్రి మల్లారెడ్డిపై ఆయన ఫైరయ్యారు. పదవులు అనుభవించినవారికే మళ్లీ మళ్లీ పదవులను కట్టబెట్టారని మైనంపల్లి హనుమంతరావు విమర్శించారు.
పార్టీలో కష్టపడిన వారిని గుర్తించాల్సిన అవసరం ఉందన్నారు. క్యాడర్ గట్టిగా ఉన్నంత కాలం పార్టీని ఎవరూ ఏమీ చేయలేరన్నారు.పార్టీ కోసం పనిచేస్తున్న కేడర్ కోసం పదవులు రావొద్దా అని ఆయన ప్రశ్నించారు. కొంతమంది మూర్ఖుల వల్ల పార్టీ తీవ్రంగా నష్టపోతుందన్నారు.పార్టీ కేడర్ గురించి మాట్లాడకపోతే తాము డమ్మీ ఎమ్మెల్యేలం అవుతామన్నారు. ప్రతి దానిని రాజకీయం చేయాల్సిన అవసరం లేదని ఆయన చెప్పారు.కార్యకర్తల కోసమే సమావేశమైనట్టుగా మైనంపల్లి హన్మంతరావు తెలిపారు.ఎవరో ఒకరు చెప్పకపోతే సమస్యలు పార్టీ అధిష్టానానికి ఎలా తెలుస్తాయని ఆయన ప్రశ్నించారు.ఎమ్మెల్యేలు కలుసుకోవడం తప్పా అని ఆయన ప్రశ్నించారు.ఎవరో చేసిన దానికి పార్టీ నష్టపోతుందని మైనంపల్లి హన్మంతరావు చెప్పారు.తమ సమావేశం తప్పేమీ కాదన్నారు. తమ నియోజకవర్గాల్లో సమస్యలను మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకు రావాలని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నామని మైనంపల్లి హనుమంతరావు చెప్పారు.ఈ రకమైన సమస్యలు అన్ని పార్టీల్లోనూ ఉంటుందని మైనంపల్లి హనుమంతరావు తెలిపారు.
పదవులున్నవాళ్లే మూడు, నాలుగు పదవులు తీసుకున్నారని మైనంపల్లి హనుమంతరావు చెప్పారు. తమ నియోజకవర్గాల్లో కేడర్ ఇబ్బంది పడుతుందనే ఉద్దేశ్యంతోనే మాట్లాడిల్సి వస్తుందని ఆయన చెప్పారు. కార్యకర్తల గురించి మాట్లాడుతున్నామన్నారు. కానీ తన వారసుల గురించి మాట్లాడడం లేదని మైనంపల్లి హనుమంతరావు తెలిపారు. తన కొడుకు తన సత్తాతో ఎమ్మెల్యే అవుతారో, సోషల్ వర్కర్ అవుతారో భవిష్యత్తు తేలుస్తుందన్నారు. కార్యకర్తలకు జరిగే నష్టం గురించే మాట్లాడాల్సి వస్తుందన్నారు. ఎమ్మెల్యేల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని సీఎం చెప్పిన మాటను కూడా కొందరు మంత్రులు పట్టించుకోవడం లేదన్నారు. ప్రజాస్వామ్యంలో మాట్లాడకపోతే ఎలా అని ఆయన అడిగారు. తాము వ్యతిరేకించిన వారికే పదవులు కట్టబెడుతున్నారని మైనంపల్లి హనుమంతరావు ఆరోపించారు. ఈ సమావేశం గురించి మీడియాకు తమ పార్టీకి చెందిన కొందరు సమాచారం ఇచ్చారని మైనంపల్లి హనుమంతరావు తెలిపారు.
also read:ఎమ్మెల్యేలు ఎందుకు సమావేశమయ్యారో తెలుసుకుంటా: మంత్రి మల్లారెడ్డి
జిల్లా నాయకత్వం ఫెయిలైనందునే రాష్ట్ర నాయకత్వం జోక్యం చేసుకోవాలని తాము కోరుతున్నామని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద గౌడ్ చెప్పారు. తమ సమావేశంలో అన్ని విషయాలను చర్చించినట్టుగా చెప్పారు. మేడ్చల్ జిల్లా అనేది కీలకమైన జిల్లా అని వివేకానంద చెప్పారు. పార్టీని బలోపేతం చేసే విషయమై కూడా ఈ సమావేశంలో చర్చించామన్నారు.