ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పై వేటు వేయాలని బీఆర్ఎస్ నాయకులు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అపాయింట్‌మెంట్ తీసుకుని ఆయన నివాసానికి వెళ్లారు. సాయంత్రం 6 గంటలకు అపాయింట్‌మెంట్ ఇచ్చిన గడ్డం ప్రసాద్ రాత్రి 8.30 గంటలైనా వారిని కలువలేదు. ఫోన్ చేసినా స్పందించలేదు. దీంతో బీఆర్ఎస్ నాయకులు అసంతృప్తి వ్యక్తం చేశారు.
బీఆర్ఎస్ నుంచి ముఖ్యమైన నాయకులు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీలు జంప్ అవుతున్నారు. అధికార పార్టీ కాంగ్రెస్‌లోకి వలస వెళ్లుతున్నారు. లోక్ సభ ఎన్నికల్లో పార్టీ టికెట్ కూడా దాదాపు కన్ఫమ్ అయినవారు కూడా పార్టీ మారుతున్నారు. చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌లు బీఆర్ఎస్‌కు రాజీనామా చేశారు. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లారు.
దానం నాగేందర్ పై యాక్షన్ తీసుకోవడానికి బీఆర్ఎస్ పార్టీ డిసైడ్ అయింది. దానం నాగేందర్ పై అనర్హత వేటు వేయాలని అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ అపాయింట్‌మెంట్ కోరారు. అపాయింట్‌మెంట్ పొందిన తర్వాత స్పీకర్ గడ్డం ప్రసాద్ నివాసానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, మాగంటి గోపీనాథ్, కాలేరు వెంకటేశ్, ముఠా గోపాల్ వెళ్లారు. కానీ, వీరిని గడ్డం ప్రసాద్ కలవలేదు. సాయంత్రం 6 గంటలకు స్పీకర్ ఈ బీఆర్ఎస్ నాయకులు, ఎమ్మెల్యేలకు అపాయింట్‌మెంట్ ఇచ్చారు.
కానీ, అనుకున్న సమయానికి ఆయన బీఆర్ఎస్ నాయకులను కలువలేదు. దీంతో వారు రాత్రి 8.30 గంటల వరకు స్పీకర్ కోసం వేచి చూశారు. గడ్డం ప్రసాద్ ఇంటిలో లేకపోవడంతో బీఆర్ఎస్ నాయకులు ఆయనకు ఫోన్ చేశారు. కానీ, ఆయన స్పందించలేదు. దీంతో సీఎం రేవంత్ రెడ్డి ఒత్తిడి మేరకే స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తమను కలవలేదని, అపాయింట్‌మెంట్ ఇచ్చి తమను కలవకపోవడం బాధాకరం అని వారు పేర్కొన్నారు.
దానం నాగేందర్ పై అనర్హత పిటిషన్ వేయాలని తాము సోమవారం కూడా స్పీకర్‌ను కలిసి విజ్ఞప్తి చేస్తామని వారు తెలిపారు.