
బీఆర్ఎస్ పార్టీపై ఆధిపత్యం సాధించేందుకు బావా బామ్మర్దులు కేటీఆర్, హరీష్ రావుల మధ్య పోటీ నెలకొందని కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి ఆరోపించారు. పార్టీని ఎవరు కబ్జా చేయాలనే రేసులో ఈ ఇద్దరు ఉన్నారంటూ ఎద్దేవా చేశారు. అందుకే ఒకరు ప్రెస్‌మీట్ పెడితే తానేం తక్కువ కాదన్నట్లు మరొకరు మరుసటి రోజే మైకుల ముందుకు వస్తున్నారని... ఈ డ్రామాలను తెలంగాణ ప్రజలంతా గమనిస్తున్నారని మంత్రి సెటైర్లు వేశారు.
తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రజలంతా తమ సొంత డబ్బులు ఖర్చు చేసుకున్నారు... అప్పట్లో బీఆర్‌ఎస్ అకౌంట్‌లో కూడా ఒక్క పైసా కూడా లేదని మంత్రి వివేక్ పేర్కొన్నారు. మరి పదేళ్ల అధికార ముగిసేసరికి ఆ పార్టీ ఖాతాలోకి రూ.1400 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయో కేసీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ చుట్టుపక్కల వేలాది ఎకరాల భూదందాలు చేసి, వందల ఎకరాల్లో ఫాంహౌస్‌లు కట్టుకున్నందుకు కేసీఆర్ కుటుంబం తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని మంత్రి కోరారు.
బ్యారేజీల్లో నీటిని నిల్వ చేయకుండానే పంపింగ్ చేయవచ్చని ఇప్పుడు బీఆర్‌ఎస్ నేతలు చెబుతుండటంపై మంత్రి మండిపడ్డారు. అదే నిజమైతే బ్యారేజీల పేరిట ప్రజల సొమ్ము వేల కోట్ల రూపాయలు ఎందుకు వృధా చేశారో చెప్పాలన్నారు. 77 వేల పుస్తకాలు చదివిన మేథావి అని చెప్పుకునే కేసీఆర్ రూపకల్పన లోపాల వల్లే కాళేశ్వరం కుంగిపోయిందని విమర్శించారు. అందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రత్యేక చర్చకు రమ్మని పిలిచినా కేసీఆర్ రాకుండా తప్పించుకుంటున్నారని ఆరోపించారు.
భారీ విద్యుత్ వినియోగంతో కూడిన ప్రస్తుత ఎత్తిపోతల వల్ల ప్రజలపై ఏటా రూ.10,000 కోట్ల కరెంట్ బిల్లుల భారం పడుతోందని మంత్రి తెలిపారు. కేవలం కాంట్రాక్టర్లను ధనవంతులను చేయడమే బీఆర్‌ఎస్ వన్ పాయింట్ ఎజెండా... అదే కాళేశ్వరంలో జరిగిందన్నారు. ఆనాడే కాకా వెంకటస్వామి చెప్పినట్లు తుమ్మిడిహెట్టి వద్ద ప్రాజెక్టు కట్టి ఉంటే రాష్ట్రానికి ఈ అవస్థలు వచ్చేవి కావన్నారు మంత్రి.
ఒకప్పుడు సింగరేణి ఆర్థిక ఇబ్బందుల నుండి ఆనాటి కేంద్ర మంత్రి కాకా వెంకటస్వామి చొరవతోనే బైటపడిందన్నారు. ప్రధాని పీ.వీ. నరసింహారావుతో మాట్లాడి రూ.400 కోట్ల ఎన్టీపీసీ లోన్ ఇప్పించి సంస్థను, లక్ష మంది కార్మికుల ఉద్యోగాలను కాపాడారని మంత్రి గుర్తుచేశారు. కానీ గత ప్రభుత్వ హయాంలో నాటి ఎమ్మెల్యే బాల్క సుమన్ సపోర్ట్ తో సింగరేణికి చెందిన డీఎంఎఫ్‌టీ, సీఎస్ఆర్ నిధులను హరీశ్ రావు సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్‌కు తరలించుకుపోయారని ఆరోపించారు.
"పార్లమెంట్‌లో బొగ్గు గనుల వేలానికి సపోర్ట్ తెలుపుతూ, ఇక్కడ వేలాలను వ్యతిరేకించడం బీఆర్ఎస్ ద్వంధ్వ వైఖరికి నిదర్శనం. సుమన్‌కు కనీసం సింగరేణి ఏ మంత్రిత్వ శాఖ కిందకు వస్తుందో కూడా అవగాహన లేదు. కేసీఆర్ ఒత్తిడితో నాటి సీఎండీ ద్వారా తాడిచర్ల మైన్ బొగ్గు పనికిరాదని చెప్పించి, ప్రైవేట్ ఏఎంఆర్ కంపెనీకి కట్టబెట్టి వందల కోట్లు నొక్కేశారు" అని మంత్రి ఆరోపించారు.
ప్రస్తుతం సింగరేణి డీఎంఎఫ్‌టీ, సీఎస్ఆర్ నిధులను సింగరేణి ప్రభావిత ప్రాంతాలైన చెన్నూరు, మందమర్రి, క్యాతనపల్లిలోనే రోడ్లు, డ్రైనేజీలు, తాగునీటి మౌలిక వసతుల కోసం ఖర్చు పెడుతున్నట్లు మంత్రి వివరించారు. మందమర్రి, చెన్నూరులలో రెండు అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లను ఏర్పాటు చేశామని.. ఇక్కడ జర్మన్ భాషా శిక్షణ ద్వారా రాబోయే 3, 4 నెలల్లో యువతకు జర్మనీలో రూ.2 లక్షల జీతంతో ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత తనదన్నారు. జైపూర్ థర్మల్ పవర్ ప్లాంట్ విస్తరణ ద్వారా మరో 5వేల ఉద్యోగ అవకాశాలు రాబోతున్నాయన్నారు.
అమృత్ పథకం ద్వారా రూ.30 లక్షలతో ఇంటింటికీ నల్లా కనెక్షన్ ఇస్తున్నామని... అలాగే పుష్కరాల నిధులు రూ.6.30 కోట్లతో అంబేద్కర్ విగ్రహం నుండి ట్యాంక్ బండ్ వరకు పనులు త్వరలోనే మొదలవుతాయని మంత్రి డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి వెల్లడించారు. బీఆర్‌ఎస్ చేస్తున్న తప్పుడు ప్రచారాలను నమ్మకుండా అభివృద్ధికి సహకరించాలని ఆయన ప్రజలను కోరారు.