అవయవ దానం చాలా గొప్పది. ఒక వ్యక్తి మరణించినా తన అవయవదానంతో మరో నలుగురి ప్రాణాలు నిలబెట్టవొచ్చు. ఇలానే ఓ కానిస్టేబుల్ కూడా తాను చనిపోయినా.. మరో నలుగురి జీవితాల్లో వెలుగునిచ్చాడు.
అన్ని దానాలకెల్లా.. అవయవ దానం చాలా గొప్పది. ఎందుకంటే.. తాను బతికినప్పుడే కాకుండా మరణిస్తూ కూడా మరో నలుగురికి ప్రాణం పోయవచ్చు. ఆ అద్భుతమైన అవకాశం ఒక్క మనిషికే సాధ్యం. ఈ మధ్యకాలంలో చాలామంది అవయవదానం ప్రాముఖ్యతను తెలుసుకుని అవయవదానం చేయడానికి స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. అలాగే.. బ్రెయిన్ డెడ్ అయిన వారి కుటుంబ సభ్యులు తమ దుఖాఃన్ని దిగమింగి తమ వారి అవయవాలను ఇతరులకు దానం చేయడానికి ముందుకు వస్తున్నారు. మరోకరి ప్రాణాలు కాపాడుతున్నారు. ఇలానే తాజాగా ఓ కానిస్టేబుల్ కూడా తాను చనిపోయి.. మరో నలుగురి జీవితాల్లో వెలుగునిచ్చాడు.
వివరాల్లోకి వెళితే.. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంకు చెందిన మేకల శ్యామ్ సుందర్ (41) అనే పోలీసు కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. జనవరి 27, శనివారం, శ్యామ్ సుందన్ తన ఇంట్లో హఠాత్తుగా కుప్పకూలిపోయి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. వెంటనే కుటుంబ సభ్యులు అతడిని ఎల్బీ నగర్‌లోని కామినేని ఆస్పత్రికి తరలించారు . కామినేని హాస్పిటల్స్‌లోని వైద్యులు శ్యామ్ సుందర్‌కు 22 రోజుల పాటు ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసియు) కేర్ సపోర్ట్ అందించారు, కాని అతని ఆరోగ్యంలో ఎటువంటి మెరుగుదల లేదు. ఆరోగ్య పరిస్థితి మెరుగుపడే సూచనలు కనిపించకపోవడంతో, ఫిబ్రవరి 18 ఆదివారం ఉదయం 10.35 గంటలకు పోలీసు కానిస్టేబుల్ బ్రెయిన్ డెడ్ అయినట్లు ఆసుపత్రి వైద్యులు ప్రకటించారు.
ఈ క్రమంలో అతని అవయవాలను దానం చేయాలని మరణించిన పోలీసు కానిస్టేబుల్ కుటుంబ సభ్యులకు వైద్యులు సూచించారు. అలాగే.. జీవందన్ అవయవదాన కోఆర్డినేటర్లు కౌన్సెలింగ్ సెషన్‌లు నిర్వహించి, మరణించిన పోలీసు కానిస్టేబుల్ కుటుంబ సభ్యులకు అవయవదానం ప్రాముఖ్యతను వివరించారు. దీంతో మృతి చెందిన పోలీస్ కానిస్టేబుల్ భార్య మేకల లిఖిత అవయవాలను దానం చేసేందుకు సమ్మతించింది. దీంతో ఆయన అవయవాలను నలుగురు రోగులకు అమర్చారు. శ్యామ్ సుందర కుటుంబ సభ్యులు చేసిన గొప్ప పనికి అందరూ ప్రశంసించారు.