
మునుగోడు అసెంబ్లీ ఎన్నికల వేళ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు షాకిచ్చేందుకు సిద్ధమయ్యారు టీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్. తెలంగాణ రాష్ట్ర సమితికి ఆయన గుడ్ బై చెప్పనున్నారు. ఈ మేరకు ఢిల్లీలో ఇవాళ జరిగిన మీడియా సమావేశంలో ఆయన సంకేతాలిచ్చారు. త్వరలో నర్సయ్య గౌడ్ బీజేపీలో చేరే అవకాశాలు వున్నాయి. దీనిపై ఆయన అధికారికంగా ప్రకటించాల్సి వుంది. అలాగే మరో సీనియర్ నేత కర్నే ప్రభాకర్‌తోనూ బీజేపీ నేతలు మంతనాలు జరుపుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.
మునుగోడు ఉపఎన్నిక అనివార్యమైన తర్వాత టీఆర్ఎస్ టికెట్ తమకు కేటాయించాలని నర్సయ్య గౌడ్, కర్నే ప్రభాకర్ తీవ్రంగా ప్రయత్నించారు. అధిష్టానం స్థాయిలో లాబీయింగ్ చేశారు. అయినప్పటికీ.. సామాజిక సమీకరణలు, విధేయత, అంగ, అర్ధబలాన్ని పరిగణనలోనికి తీసుకున్న కేసీఆర్.. మునుగోడు టికెట్‌ను కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికే అప్పగించారు.
Also REad:మునుగోడులో అసంతృప్తులను బుజ్జగించిన కేసీఆర్.. కూసుకుంట్లను గెలిపిస్తామన్న కర్నె , నర్సయ్యగౌడ్
కూసుకుంట్ల అభ్యర్ధిత్వం ఖరారు చేసిన వెంటనే కర్నే ప్రభాకర్ , బూర నర్సయ్య గౌడ్‌లను ప్రగతి భవన్‌కు పిలిపించి మాట్లాడారు కేసీఆర్. అనంతరం వారిద్దరూ మీడియాతో మాట్లాడుతూ.. మునుగోడు అభివృద్ధి కోసం కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని గెలిపించాలన్నారు నర్సయ్య గౌడ్. టికెట్ ఆశించడం తప్పు కాదని.. తన అవసరం జాతీయ రాజకీయాల్లో వుంటుందని కేసీఆర్ అన్నారని ఆయన తెలిపారు. కేసీఆర్ ఆదేశాలు పాటిస్తానని నర్సయ్యగౌడ్ స్పష్టం చేశారు. కర్నె ప్రభాకర్ మాట్లాడుతూ.. మునుగోడు టీఆర్ఎస్‌లో అసంతృప్తి లేదన్నారు. అందరిలాగే తాను కూడా టికెట్ ఆశించానని.. తనకు ఆ హక్కు వుందని కర్నె చెప్పారు. కేసీఆర్ నిర్ణయం అమలు చేయాల్సిన బాధ్యత తమపై వుందని ఆయన పేర్కొన్నారు. అధినేత ఏ నిర్ణయం తీసుకున్నా పార్టీ బలోపేతం కోసమేనని కర్నె చెప్పారు. కూసుకుంట్లను భారీ మెజారిటీతో గెలిపిస్తామని ఆయన పేర్కొన్నారు.