వివేకా హత్య కేసు.. వైఎస్ భాస్కర్ రెడ్డికి చుక్కెదురు, బెయిల్ పిటిషన్ కొట్టివేసిన సీబీఐ కోర్ట్

By Siva KodatiFirst Published Jun 9, 2023, 5:07 PM IST
Highlights

వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి‌ బెయిల్ పిటిషన్‌ను సీబీఐ కోర్ట్ కొట్టివేసింది

ఏపీ సీఎం వైఎస్ జగన్ బాబాయ్, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి‌కి కోర్టులో చుక్కెదురైంది. ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను సీబీఐ కోర్ట్ శుక్రవారం కొట్టివేసింది. 

కాగా.. వైఎస్ఆర్ సీపీ నేత అవినాష్ రెడ్డికి  వివేక హత్య కేసు దర్యాప్తులో సిబిఐ నోటీసులు జారీ చేసినప్పటి నుంచి అనేక నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. అవినాష్ రెడ్డి మొదట విచారణకు హాజరయ్యారు. ఇదే కేసులో అవినాష్ రెడ్డి  తండ్రి వైయస్ భాస్కర్ రెడ్డిని అరెస్టు చేశారు. ఆ తర్వాత.. తనను కూడా  అరెస్ట్ చేస్తారన్న అనుమానంతో విచారణకు హాజరు కావడానికి ఏదో ఒక వంకతో వెనక్కు తగ్గుతున్నారు.

మే 16వ తేదీ నుంచి విచారణకు హాజరు కావడం లేదు. తల్లి ఆరోగ్యం బాగాలేదని. కర్నూలు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటుందని చెప్పారు. ఆ సమయంలో సిబిఐ బృందం కర్నూలు వెళ్లి అవినాష్ రెడ్డిని అరెస్టు చేయడానికి ప్రయత్నించింది కూడా. అవినాష్ రెడ్డి అనుచరులు ఆస్పత్రి ముందు పెద్ద ఎత్తున మొహరించడంతో.. ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. దీంతో సిబిఎస్ స్థానిక ఎస్పీ సహాయం  కోరగా.. శాంతిభద్రతల  కారణం చెబుతూ పోలీసులు సిబిఐకి సహాయం చేయడానికి నిరాకరించడంతో వారు వెను తిరిగారు.ఇదే సమయంలో హైకోర్టుకు వేసవి సెలవులు రావడంతో అవినాష్ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ జరిగేలా హైకోర్టును ఆదేశించాలని కోరారు.

ALso Read: వైఎస్ వివేకా హత్య కేసు: జగన్ కు ముందే తెలుసన్న సీబీఐ

సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వేసవి సెలవుల్లో తెలంగాణ హైకోర్టు అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ పై సుదీర్ఘ వాదనలు విన్నది. ఆ తర్వాత మే 31వ తేదీన షరతులతో కూడిన బెయిలు మంజూరు చేస్తూ తీర్పు విలువరించింది. ఒకవేళ అవినాష్ రెడ్డిని అరెస్టు చేస్తే…వెంటనే పూచీకత్తులు తీసుకొని విడుదల చేయాలని కూడా హైకోర్టు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే అవినాష్ రెడ్డి సిబిఐ కార్యాలయానికి విచారణ నిమిత్తం హాజరైనప్పుడు అరెస్టు చేసినట్లుగా తెలుస్తోంది.

సాంకేతికంగా అరెస్టు చేసి.. రెండు పూచీకత్తులు తీసుకుని విడుదల చేసింది. అయితే ఈ విషయాన్ని అవినాష్ రెడ్డి గాని, సిబిఐ గాని  వెల్లడించలేదు. అరెస్టు విషయం.. విడుదల విషయం గోప్యంగా ఉంచారు. అంతకుముందు వివేకానంద రెడ్డి హత్య కేసులో అప్రూవర్ గా మారిన దస్తగిరి విషయంలో కూడా సిబిఐ ఇలాగే వ్యవహరించింది. 2021 అక్టోబర్ 22న దస్తగిరికి న్యాయస్థానం షరతులతో కూడిన ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఆ తర్వాత అక్టోబర్ 23వ తేదీన సిబిఐ అధికారులు దస్తగిరిని అరెస్టు చేశారు. రూ.20 వేల  పూచీకత్తు తీసుకుని వెంటనే విడుదల చేశారు. ఇలాగే అవినాష్ రెడ్డి విషయంలోను జరిగింది.
 

click me!