
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతుంది. ఈ క్రమంలోనే ఆదివారం ఖమ్మంలో నిర్వహించిన రైతు గోసా-బీజేపీ భరోసా సభ విజయవంతం కావడం ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపింది. ఈ సభకు హాజరైన బీజేపీ అగ్రనేత, కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. బీజేపీ రాష్ట్ర కోర్ కమిటీ సభ్యులతో సమావేశమయ్యారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌పై విజయం సాధించేందుకు పార్టీని మరింత విస్తృతం చేసేందుకు కార్యాచరణ ప్రణాళికపై ఈ సమావేశంలో నేతలతో అమిత్ షా చర్చించారు.
అయితే తాజాగా ఈ నెల 29, 30 తేదీల్లో రాష్ట్రంలో ఉమ్మడి జిల్లాల వారీగా అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీజేపీ సమీక్షా సమావేశాలు నిర్వహించనుంది. ఈ సమావేశాల్లో అసెంబ్లీ స్థానాల వారీగా బూత్ కమిటీలు, సెప్టెంబర్ 7న చలో హైదరాబాద్, నా మట్టి నా దేశం, బస్సు యాత్ర, ఓటర్ వెరిఫికేషన్, సెప్టెంబర్ 17, ఎన్నికలకు సన్నద్దం వంటి తదితర అంశాలపై చర్చించారు. ఈ సమీక్షా సమావేశాలకు పార్టీ ముఖ్య నేతలు హాజరుకానున్నారు.
సునీల్ బన్సల్ ( ఖమ్మం, మెదక్), అరవింద్ మీనన్ (ఆదిలాబాద్, నిజామాబాద్), తరుణ్ చుగ్ (కరీంనగర్, నల్గొండ), ప్రకాష్ జవదేవకర్ (మహబూబ్‌నగర్, వరంగల్) సమీక్షా సమావేశాలకు హాజరుకానున్నారు. ఈ సమావేశాలకు రాష్ట్రానికి చెందిన కొందరు ముఖ్య నేతలు కూడా వెళ్లనున్నారు. బండి సంజయ్ (ఆదిలాబాద్), డీకే అరుణ (నిజామాబాద్), కిషన్‌రెడ్డి (మెదక్), ఈటల రాజేందర్ (నల్గొండ) సమావేశాలకు వెళ్లనున్నారు.