రేపే తెలంగాణ బంద్: ప్రజలకు లక్ష్మణ్ పిలుపు

By narsimha lodeFirst Published Oct 18, 2019, 1:48 PM IST
Highlights

ఆర్టీసీ సమ్మె విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ మండిపడ్డారు. తెలంగాణ బంద్ కు ప్రజలు మద్దతివ్వాలని ఆయన కోరారు. 

హైదరాబాద్:తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం  తరహాలోనే  ఆర్టీసీ సమ్మె విషయంలో  కూడ తాము మరో ఉద్యమానికి సిద్దమౌతామని  బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ చెప్పారు.

శుక్రవారం నాడు  లక్ష్మణ్  బీజేపీ కార్యాలయంలో  మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వానికి అన్ని వర్గాల ప్రజలు, ప్రజా సంఘాలు, కుల సంఘాలు ఎదురు తిరిగాయని ఆయన ఆరోపించారు. నిన్నటి నుండి ఉబేర్, ఓలా కార్మికులు, ఉద్యోగులు అన్ని క్యాబ్ డ్రైవర్లు కూడ నిరవధిక సమ్మెకు మద్దతుగా నిలిచిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
 
అసలు రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా అనే అనుమానం కలుగుతోందని ఆయన చెప్పారు. ఆర్టీసీ సమ్మె ఉధృతంగా సాగుతోందన్నారు. రాష్ట్రంలో కార్యకలాపాలు స్థంభించిపోయాయన్నారు.

ఆర్టీసీ సమ్మె విషయంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు దారుణంగా ఉందన్నారు. ఆర్టీసీ సమ్మె విషయంలో  మంత్రి పువ్వాడ అజయ్ కుమార్  స్పందించకపోవడం బాధాకరమన్నారు. పాలన అటకెక్కించి కేవలం తన ప్రతిష్ట కోసం ప్రజల జీవితాలతో సీఎం కేసీఆర్ చెలగాటమాడుతున్నారని లక్ష్మణ్ విమర్శించారు.

రాష్ట్రంలో పాలన ఉందా అనే అనుమానం వస్తోందన్నారు. ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా ఈ నెల 19వ తేదీన తలపెట్టిన రాష్ట్ర బంద్ ను విజయవంతం చేయాలని  ఆయన ప్రజలను కోరారు.

ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా ఇప్పటికే రెండు దపాలు  బీజేపీ నేతలు రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ను కలిశారు. ఆర్టీసీ సమ్మె విషయమై ప్రభుత్వం అనుసరించిన విధానాలపై బీజేపీ నేతలు గుర్రుగా ఉన్నారు. ఇదే విషయమై గవర్నర్ కు ఫిర్యాదు చేశారు.

ఈ నెల 5వ తేదీ నుండి ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్నారు. సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులను సెల్ప్ డిస్మిస్ అయినట్టుగా ప్రభుత్వం ప్రకటించడంపై ఆర్టీసీ కార్మికులు ఆవేదనతో ఉన్నారు. ఇప్పటికే ఇద్దరు ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మరో ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.  

click me!