
హైదరాబాద్ హెచ్‌ఐసీసీ వేదికగా బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు సాగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఆ సమావేశాల్లోకి తెలంగాణ స్టేట్ ఇంటెలిజెన్స్ అధికారులు ప్రవేశించడం కలకలం రేపింది. ఈ సమావేశాలు జరుగుతున్న హాల్లోకి స్టేట్ ఇంటెలిజెన్స్‌కు చెందిన అధికారి ఒకరు ప్రవేశించినట్టుగా తెలుస్తోంది. అయితే ఆ అధికారిని గుర్తించిన బీజేపీ నేతలు బయటకు పంపించినట్టుగా చెబుతున్నారు. బీజేపీ సమావేశాల్లోకి స్టేట్ ఇంటెలిజెన్స్ పోలీసులు రావడంపై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక, మీటింగ్‌కు సంబంధించి తీర్మానాల కాపీని ఇంటెలిజెన్స్ పోలీసు అధికారి ఒకరు ఫొటో తీస్తుండగా గమనించి బయటకు పంపించినట్టుగా తెలుస్తోంది.
ఇదే విషయాన్ని బీజేపీ సీనియర్ నేత ఇంద్రాసేన రెడ్డి మీడియాకు తెలియజేశారు. సమావేశాల లోపల జరిగే అన్ని విషయాలను బయటకు చెప్పరని అన్నారు. తీర్మానాలు ఆమోదం పొందిన తర్వాత తుది వివరాలను బయటకు వెల్లడిస్తారని తెలిపారు. అయితే ఇంటెలిజెన్స్ పోలీసు అధికారి.. పోలీసు పాస్‌తో లోనికి వచ్చి.. అనుమతిలేని ప్రదేశంలోకి వచ్చి తీర్మానా కాపీని ఫోటోలు తీశాడని చెప్పారు. అయితే అతడిని పట్టుకుని సీపీకి అప్పగించడం జరిగిందన్నారు. అక్కడే ఫోన్‌లో తీసిన ఫొటోలను డిలీట్ చేయించడం జరిగిందన్నారు. అయితే ఇటువంటి చర్యలు రాష్ట్ర ప్రభుత్వానికి తగదని ఇంద్రాసేన రెడ్డి చెప్పారు. అంతర్గత సమావేశంలోకి పంపించి నిఘా పెట్టడం మంచి పద్ధతి కాదని సూచించారు.
ఇక, బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు రెండో రోజు కొనసాగుతున్నాయి. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలను పురస్కరించుకొని తెలంగాణపై ఆ పార్టీ నేతలు కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. వచ్చే ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావాలని బీజేపీ అధిష్టానం ప్రణాళికలు రచిస్తున్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలోనే బీజేపీ నాయకత్వం చేసే ప్రకటన ఏమిటనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
ప్రస్తుతం జాతీయ కార్యవర్గ సమావేశాల్లో రాజకీయ తీర్మానంపై చర్చ జరుగుతుంది. రాజకీయ తీర్మానానికి బీజేపీ జాతీయ కార్యవర్గం ఆమోదం తెలపనుంది. మధ్యాహ్నం 3 గంటలకు ప్రధాని మోదీ ప్రతినిధులను ఉద్దేశించి మాట్లాడనున్నారు. సాయంత్రం 4 గంటల వరకు బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు కొనసాగనున్నాయి.