
జగిత్యాల: కేంద్ర ప్రభుత్వం ఆర్మీ రిక్రూట్ మెంట్ కోసం తీసుకువచ్చిన అగ్నిపథ్ పథకంపై విమర్శలు గుప్పించిన రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్ కు బిజెపి ఎంపీ ధర్మపురి అరవింద్ (dharmapuri arvind) కౌంటరిచ్చారు. అసలు అగ్నిపథ్ గురించి కేటీఆర్ కు ఏం తేలీదు... తెలిసీ తెలియని సమాచారంతో ఇష్టమొచ్చినట్లు వాగొద్దని హెచ్చరించారు. ముందు ఎవరినైనా అడిగి దీనిగురించి పూర్తిగా తెలుసుకోవాలని కేటీఆర్ కు బిజెపి ఎంపీ అరవింద్ సూచించారు.
జగిత్యాల జిల్లా కేంద్రంలో హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ తో కలిసి అరవింద్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రులు కేటీఆర్, హరీష్ రావు పర్యటనల సందర్భంగా రైతులను ముందస్తు అరెస్టులు ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. రైతులపై పెడుతున్న అక్రమ కేసులను చూస్తుంటే సీఎం కేసీఆర్ కు వారంటే ఎంతప్రేమ ఉందో తెలుస్తోందన్నారు.
గత ఎన్నికల సమయంలో పసుపు బోర్డ్ తెస్తామని హామీ ఇచ్చాను... కానీ తానిచ్చిన హామీకంటే మెరుగైన స్పైస్ బోర్డ్ తీసుకువచ్చానని అరవింద్ అన్నారు. కానీ టీఆర్ఎస్ పార్టీ చెరుకు ఫ్యాక్టరీ తెరిపిస్తానన్న హామీ మరిచిందని... కనీసం ఇథనాల్ ఫ్యాక్టరీ అయినా ఏర్పాటుచేయాలని అరవింద్ కోరారు.
సీఎం కేసీఆర్ ఇచ్చిన వంద హామీల్లో ఒకటి ఈ ఎన్నారై సెల్... కానీ ఇప్పటివరకు ఆ దిశగా చర్యలే శూన్యమని బిజెపి ఎంపీ అన్నారు. కానీ తన ఆఫీస్ లో ఎన్నారై సెల్ పెట్టి 500 కేసులు పరిష్కరించానని అరవింద్ గుర్తుచేసారు. ప్రధాని మోదీ తెలంగాణ రాష్ట్రంపై దృష్టి పెట్టారని... ఇక్కడ బిజెపి ప్రభుత్వ ఏర్పాటు ఖాయమని ధర్మపురి అరవింద్ ధీమా వ్యక్తం చేసారు.
ఇక ఈటల రాజేందర్ మాట్లాడుతూ... దేశం లో మొట్ట మొదటిసారిగా గిరిజన మహిళను భారత అత్యుత్తమ స్థానంలో నిలపాలని బిజెపి ప్రయత్నిస్తోందని అన్నారు. తద్వారా అణగారిన వర్గాలు, జాతులకు గుర్తింపు వచ్చిందన్నారు. కానీ ఇదే కేసీఆర్ తెలంగాణకు తొలి సీఎం దళితులను చేస్తానని మోసం చేసారని గుర్తచేసారు.
గత రెండుమూడేళ్లుగా కరోనాతో లక్షల మంది ఉపాధి లేకుండా వుంటే వారికోసం కేంద్రం ఆలోచిస్తోందని... అందులో భాగంగానే అగ్నిపథ్ పథకాన్ని తీసుకువచ్చిందన్నారు. అలాంటి పథకాన్ని వ్యతిరేకిస్తూ హైదరాబాద్ నడిబొడ్డును సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో విధ్వంసం రేగితే రమాండ్ కంట్రోల్ రూమ్, పోలీసులు ఏం చేస్తున్నారని ఈటల నిలదీసారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆస్తులన్నీ ప్రజల ఆస్తులేనని అన్నారు.
వరంగల్ జిల్లాలో చనిపోయిన యువకుడి శవంతో కేసీఆర్ రాజకీయం చేస్తుండు... ఇలాంటి నీచ రాజకీయాలు ఆయనకే చెల్లాయని ఎద్దేవా చేసారు. తెలంగాణలో ఎంతో మంది చనిపోయిన యువకులకు నష్ట పరిహారం ఇవ్వలేదు... కానీ వరంగల్ యువకుడికి మాత్రం పరహారం ప్రకటించారు.... ఇది కేవలం రాజకీయ లబ్ది కోసమేనని ఆరోపించారు.
ప్రజా సమస్యలను గాలికి వదిలేసి సీఎం కేసీఆర్ నీరో చక్రవర్తిలా వ్యవహరిస్తున్నాడని మండిపడ్డారు. ఇలాంటి కేసీఆర్ ను రాజకీయంగా బొందపెట్టడం ఖాయమని... ఈ గడ్డ మీద బీజేపీ జెండా పాతుతామని ఈటల రాజేందర్ పేర్కొన్నారు.