Bandi Sanjay: బీజేపీ ఎంపీ బండి సంజయ్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీశారు. ఎన్నికల షెడ్యూలు రాకముందే ఆరు గ్యారంటీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. కొత్త ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే యుద్ధప్రాతిపదికన కొత్త రేషన్‌కార్డుల జారీని చేపట్టి వారంలోగా ప్రక్రియ పూర్తి చేసి మొత్తం ఆరు హామీలను అందించాలని కోరారు.
Bandi Sanjay: లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించకముందే అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ఆరు హామీలను అమలు చేయాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌కుమార్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ నెలలో ఎప్పుడయినా పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ వెలువడే అవకాశం ఉందని, కాబట్టి షెడ్యూల్ ప్రకటించకముందే రాష్ట్ర ప్రభుత్వం పథకాల అమలును ప్రారంభించాలని అన్నారు.
గావో చలో అభియాన్‌లో భాగంగా బుధవారం హుజూరాబాద్ మండలం రంగాపూర్‌లో కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపట్టిన పనులను బీజేపీ నాయకులు పరిశీలించారు. కొత్త ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే యుద్ధప్రాతిపదికన కొత్త రేషన్‌కార్డుల జారీని చేపట్టి వారంలోగా ప్రక్రియ పూర్తి చేసి మొత్తం ఆరు హామీలను అందించాలని కోరారు.
అసలు తెల్ల రేషన్ కార్డు ఉంటేనే పథకాలు ఇస్తామని ఎన్నికల్లో ఎందుకు చెప్పలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌కు చిత్తశుద్ది ఉంటే.. పథకాలు అందరికీ ఇవ్వాలని, పథకాల అమలులో ఎలాంటి ఆంక్షలు పెట్టవద్దని అన్నారు. గత ప్రభుత్వం దుర్మార్గాలు చేసిందని, ప్రజలను మోసం చేసిందని బండి సంజయ్ సూచించారు.
మరోవైపు.. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ వచ్చే లోక్‌సభ ఎన్నికలకు సమాయత్తం అవుతూ ప్రచారంపై దృష్టి సారించారు. సన్నాహాల్లో భాగంగా ఈ నెల 10వ తేదీ నుంచి యాత్రను ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ప్రజాహిత యాత్ర పేరుతో ఎన్నికల వరకు సాగుతుంది. కొండగట్టు వద్ద ఆశీర్వాదం తీసుకున్న అనంతరం మేడిపల్లి నుంచి యాత్ర ప్రారంభమవుతుంది. తొలుత వేములవాడ, సిరిసిల్ల నియోజకవర్గాలపై దృష్టి సారించి 119 కిలోమీటర్ల మేర సాగనుంది. యాత్రకు సంబంధించిన రూట్ మ్యాప్ ను బీజేపీ శ్రేణులు ఖరారు చేయనున్నారు.