ఎన్నికల వేళ ఎదురుతిరిగిన రాజాసింగ్.... బండి సంజయ్ ని అధ్యక్ష పదవి నుండి తప్పించాలని సంచలన ట్వీట్

By telugu teamFirst Published Nov 22, 2020, 7:19 PM IST
Highlights

తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ కు వ్యతిరేకంగా పార్టీ ఎమ్మెల్యే రాజాసింగ్ ట్వీట్ చేశారు. బండి సంజయ్ తీరును ఆయన తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

బిజెపి లో అంతర్గత విబేధాలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మూడు రోజుల కిందట రాజా సింగ్ రాజీనామా వ్యవహారం ప్రకంపనలు రేపగా కార్యకర్తలు, తన అనుచరుల విజ్ఞప్తితో తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. కానీ గత మూడు రోజుల నుండి గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో తనను పక్కన పెట్టడంపై తీవ్ర అసంతృప్తితో ఉండగా అది ఈ రోజు బయటపడింది. పార్టీ క్షేమం దృష్ట్యా బండి సంజయ్ వైఖరి పార్టీ కి తీవ్ర నష్టం కలిగించే అవకాశం ఉందని..

బండి సంజయ్ తీరుతో నగర పార్టీ నాయకులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు ట్వీట్ చేశారు. ఇప్పటికైనా బిజెపి కేంద్ర అధిష్టానం జోక్యం చేసుకొని బండి సంజయ్ ని అధ్యక్ష పదవి నుండి తొలగించాలని ట్వీట్ చేసి రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టించారు. ఆయన చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అసలు గ్రేటర్ హైదరాబాద్ లో హిందుత్వ వాదాన్ని బల పరిచిందే రాజా సింగ్ అని ఇప్పుడు ఆయన్నే పక్కన పెట్టడం రాజాసింగ్ అభిమానులకు తీవ్ర ఆవేశం తెప్పిస్తుంది.

ఇప్పటికే బండి సంజయ్ తీరుతో ఇటీవల గెలిచిన దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు కూడా కొంచెం అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే ఇటీవల వరద సహాయ బాధితులకు తెలంగాణ ప్రభుత్వం సహాయం చేసే విషయమై బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ పేరిట లేఖ విడుదల కాగా అది తన పేరిట ఎవరో సృష్టించారని ఆ లేఖ తాను రాయలేదని చెప్పగా రఘునందన్ రావు మాత్రం వరద సహాయాన్ని నిలిపేయాలని తమ పార్టీ ఏ లేఖ రాసిందని ఒక టివి ఛానెల్ చర్చలో ఒప్పుకోవటం గమనార్హం.

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా బండి సంజయ్ తీరుతో తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తుంది. అందుకే ఈ రోజు ఆయనే స్వయంగా రంగంలోకి దిగి మీడియా సమావేశాన్ని నిర్వహించగా ఒక విలేఖరి బండి సంజయ్ చలాన్ల అంశాన్ని ప్రస్తావించగా ఆ విషయం తనకు తెలియదని దాట వేశారు. దాంతో బండి సంజయ్ మరియు కొందరు బిజెపి అగ్రనేతలకు కొన్ని అంతర్గత విబేధాలున్నట్లు స్పష్టం అవుతుంది.

అయితే, ఆ ట్వీట్ తాను చేయలేదని రాజాసింగ్ తర్వాత స్పష్టం చేశారు. తన అధికారిక ట్విట్టర్ లో ఎవరో అలాంటి పోస్టు పెట్టి తప్పుడు ప్రచారం సాగించారని ఆయన అన్నారు. 

click me!