
వేములవాడ: వేములవాడ ఆలయ (Vemulawada Temple) అభివృద్దిని టీఆర్ఎస్ (TRS) ప్రభుత్వం మరిచిందని బిజెపి ఎమ్మెల్యే రఘునందన్ రావు (raghunandan rao) ఆరోపించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ (cm kcr), సిరిసిల్ల జిల్లా మంత్రి కేటీఆర్ (KTR) వేములవాడ రాజన్న ఆలయ అభివృద్దికి అనేక హామీ ఇచ్చారని... కానీ ఇప్పటివరకు ఎలాంటి అభివృద్ది జరగలేదని మండిపడ్డారు. యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి (yadadri temple) ఆలయానికి ఒక న్యాయం... వేములవాడ రాజన్న ఆలయానికి మరో న్యాయమా? అని రఘునందన్ నిలదీసారు.
శుక్రవారం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామిని దుబ్బాక (dubbaka) ఎమ్యెల్యే రఘునందన్ రావు దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఎమ్మెల్యేకు ఆలయ సిబ్బంది సాదరస్వాగతం పలికారు. స్వామివారి దర్శనం అనంతరం అర్చకుల ఆశీర్వచనం తీసుకున్న ఎమ్మెల్యే తీర్థప్రసాదాలు అందుకున్నారు.
ఈ సందర్భంగా వేములవాడ ఆలయంమొత్తాన్ని పరిశీలించిన రఘునందన్ మీడియాతో మాట్లాడుతూ...సిరిసిల్ల జిల్లానుండి ప్రాతినిధ్యం వహిస్తున్న కేటిఆర్ తనకు సిరిసిల్ల, వేములవాడ రెండు కళ్ళని అన్న మాటలను గుర్తుచేసారు. అయితే ఇప్పటివరకు ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్లకి ఎన్ని నిధులు ఇచ్చారు... వేములవాడకి ఎన్ని నిధులు ఇచ్చారో బయటపెట్టాలన్నారు. వేములవాడ అభివృద్ది కేవలం మాటలు, హామీలకే పరిమితమయ్యిందని రఘునందన్ పేర్కొన్నారు.
''శివరాత్రి (shivaratri) పేరిట అధికారులు కొన్నిరోజులు హంగామా చేస్తారు. కానీ ఏర్పాట్లన్నీ వీఐపీల కోసమే జరుగుతాయి. శివరాత్రి జాతర సమయంలో ఆలయంలోని 550 వసతి గదుల్లో విఐపిల కోసమే 400 వరకు కేటాయిస్తున్నారు. మరి సామాన్యుల భక్తులు ఏం కావాలి. సామాన్య భక్తులను పట్టించుకోవడం లేదు. భక్తుల కోసం ఎన్ని ఖర్చు చేస్తున్నారు... విఐపిల కోసం ఎన్ని కోట్లు ఖర్చు చేస్తున్నారు..?'' అని రఘునందన్ నిలదీసారు.
''వేములవాడ ఎమ్యెల్యే చెన్నమనేని రమేష్ అసలు నియోజకవర్గానికే రాడు... ఆయన గుడికి ఏం చేస్తాడు. రాజన్న ఆలయాన్ని స్థానిక ఎమ్మెల్యే ఏమాత్రం పట్టించుకోడు... మరి ప్రభుత్వం ఏం చేస్తుంది? ఇప్పటికయిన ఆలయ అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టిపెట్టాలి'' అని సూచించారు.
''వేములవాడ రాజన్న అంటే చాల శక్తిమంతమైన దేవుడు. అలాంటి మహిమగలిగిన దేవుడికి సీఎం కేసీఆర్ శఠ గోపం పెట్టాలనుకోవడం ముర్ఖత్వం. సీఎం కేసీఆర్ స్వయంగా వేములవాడ రాజన్న సన్నిధిలోనే రూ.400 కోట్లతో ఆలయాన్ని డెవలప్ చేస్తామని హామీ ఇచ్చారు. కానీ ఇప్పటివరకు ఏమాత్రం అభివృద్దికి ఆలయం నోచుకోలేదు... ఎందుకు చేయలేదో కేసీఆర్ సమాధానం చెప్పాలి'' అని ప్రశ్నించారు.
''నిత్యం లక్షల మంది భక్తులు వస్తున్నా కనీసం భక్తులకు సౌకర్యాలు కల్పించడం లేదు. ఏటా 100 కోట్ల ఆదాయం దాటుతున్న భక్తుల సమస్యలు మాత్రం తీరడం లేదు. రంగుల రంగుల బ్రోచర్లతోనే కాలం వెల్లదీస్తున్నారు'' అని బిజెపి ఎమ్మెల్యే రఘునందన్ ఆగ్రహం వ్యక్తం చేసారు.