మునుగోడులో ఓడి గెలిచిన బీజేపీ.. పరాజయం పాలైనా ప్లస్సే.. ఎలాగంటే?

By Mahesh KFirst Published Nov 7, 2022, 9:36 AM IST
Highlights

మునుగోడులో బీజేపీ ఓడినా గెలిచినట్టే, వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు బలమైన భూమికను ఏర్పాటు చేసుకోగలిగిందే అభిప్రాయాలు వస్తున్నాయి. 2018లో ఎన్నికతో పోలిస్తే.. ఈ సారి బీజేపీ అనూహ్యంగా పుంజుకుంది.
 

హైదరాబాద్: మునుగోడు ఉపఎన్నిక స్థూలంగా చూస్తే కాంగ్రెస్ తన సీటు కోల్పోయింది. టీఆర్ఎస్ కొత్తగా ఒక స్థానాన్ని పెంచుకుంది. కానీ, గతేడాది నామమాత్రంగానే పోటీ ఇచ్చిన బీజేపీ మాత్రం ఈ సారి బలమైన పార్టీగా పోటీ ఇచ్చింది. పోరులో బలమైన ప్రత్యర్థిగా పరిణమించింది. స్వల్ప తేడాతోనే ఓడిపోయింది.

2018 అసెంబ్లీ ఎన్నికల్లో మునుగోడు స్థానంలో బీజేపీ అభ్యర్థిగా గంగిడి మనోహర్ రెడ్డి బరిలోకి దిగారు. అప్పుడు ఆయనకు 12,725 ఓట్లు వచ్చాయి. కానీ, ఈ ఉపఎన్నికలో కమలం బలమైన పార్టీగా ఎదిగింది. గత ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ పార్టీని వెనక్కి నెట్టడమే కాదు.. టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయం బీజేపీనే అని నిరూపించుకుంది. ఈ లెక్కన మునుగోడు ఉపఎన్నికలో ఓటమి పాలైనా సీటు కోల్పోయిందేమీ లేదు. కానీ, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం అధికార పార్టీ టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయం తానే అని ప్రజల్లోకి తీసుకెళ్లింది. బీజేపీ ఎప్పుడూ కలవరించే కాంగ్రెస్ ముక్త్ అనే నినాదాన్ని మునుగోడులో నిజం చేసుకుంది.

ప్రస్తుత ఉపఎన్నికలో బీజేపీ భారీగా ఓట్లు పెంచుకుంది. ఈ ఎన్నికలో కాంగ్రెస్‌కు రాజీనామా చేసి ఉపఎన్నికను తెచ్చిన రాజగోపాల్ రెడ్డి బీజేపీ తరఫున పోటీ చేశాడు. బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన రాజగోపాల్ రెడ్డి 86,697 ఓట్లను పొందాడు. 2018 ఎన్నికతో ప్రస్తుత ఫలితంతో పోలిస్తే.. బీజేపీ 73,972 ఓట్లను పెంచుకుంది. ఉపఎన్నికలో విస్తృత, డెడికేటెడ్ క్యాంపెయిన్ చేసిన బీజేపీ అనూహ్యంగా ఓట్లు సంపాదించుకుంది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఇతర పార్టీ సీనియర్ లీడర్లు ఉధృతంగా ప్రచారం చేశారు.

బీజేపీ బలంగా పుంజుకోవడంతో కాంగ్రెస్ డిపాజిట్లు కూడా దక్కించుకోలేదు. ఈ దెబ్బతో మునుగోడులో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్‌తో నువ్వా నేనా? అనే పోటీ ఇచ్చే పార్టీ, రాష్ట్రంలో అధికార పార్టీకి ప్రత్యామ్నాయ పార్టీ బీజేపీనే అని ఆ నేతలు ప్రజల్లో అభిప్రాయాన్ని తేగలిగారు.

కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచినప్పుడూ పడిన ఓట్లు రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరినా పడినట్టుగానే తెలుస్తున్నది. ఈ విధంగా బీజేపీ నేరుగా కాంగ్రెస్ ఓటు బేస్‌ను కూడా కొల్లగొట్టింది. ఈ కోణంలో అభిప్రాయాలు వెల్లడిస్తూ బీజేపీ ఈ ఎన్నికలో ఓడినా గెలిచినట్టే అనే వాదనను పలువురు విశ్లేషకులు తెర మీదకు తెస్తున్నారు. అదే విధంగా టీఆర్ఎస్ కూడా ఫ్లోరైడ్ సమస్యను బలంగా తీసుకెళ్లి, సంక్షేమ పథకాలు, ఇతర అంశాలను లేవనెత్తుతూ, వ్యూహాలను అమలు చేస్తూ సీటు దక్కించుకుంది.

పార్టీ మారి ఓడిన రాజగోపాల్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో ఏమాత్రం పోటీ ఇవ్వగలడనేది ఇప్పుడే చెప్పలేం. ఒకవేళ అభ్యర్థి మారితే.. బీజేపీ ప్రదర్శన ఇదే స్థాయిలో ఉంటుందనీ చెప్పలేం అని మరికొందరు వాదిస్తున్నారు.

click me!