తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్‌ను బీజేపీ నేతల బృందం కలిసింది. టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీక్ వ్యవహారంపై చర్యలు తీసుకోవాలని గవర్నర్ తమిళిసైని బీజేపీ నేతలు కోరారు.
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్‌ను బీజేపీ నేతల బృందం కలిసింది. టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీక్ వ్యవహారంపై చర్యలు తీసుకోవాలని గవర్నర్ తమిళిసైని బీజేపీ నేతలు కోరారు. ఈ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఫిర్యాదు చేశారు. పేపర్ లీక్‌పై సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని గవర్నర్ తమిళిసైకి బీజేప నేతల బృందం విజ్ఞప్తి చేసింది. గవర్నర్‌ను కలిసిన వారిలో ఈటల రాజేందర్, బూర నర్సయ్య గౌడ్, రామచంద్రరావు, మర్రి శశిధర్ రెడ్డి.. తదితరులు ఉన్నారు. గవర్నర్‌ను కలిసిన అనంతరం బీజేపీ నేతలు మీడియాతో మాట్లాడారు.
ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీక్ ఘటనకు బాధ్యత వహించి సీఎం కేసీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పేపర్ లీక్ అయిందంటే కేసీఆర్ పనితనం ఏమిటో తెలుస్తోందని ఎద్దేవా చేశారు. ఏళ్ల తరబడి నిరుద్యోగులు కష్టపడి, అప్పులు చేసిన ప్రిపేర్ అవుతున్నారని చెప్పారు. ఎగ్జామ్స్‌కు ప్రిపేర్ అయిన ప్రతి విద్యార్థికి మళ్లీ చదువుకోవడాని రూ. లక్ష పరిహారం ఇవ్వాలని కోరారు. రద్దు చేసిన పరీక్షను ఆలస్యం చేయకుండా వెంటనే నిర్వహించాలని డిమాండ్ చేశారు. నియంత ప్రభుత్వాన్ని కూల్చేందుకు పోరాటం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కేసీఆర్ హయాంలో పరీక్ష నిర్వహణపై ప్రజల్లో విశ్వాసం పోయిందని అన్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం.. కనీసం పరీక్షలు కూడా నిర్వహించలేని అసమర్ద ప్రభుత్వమని విమర్శించారు. టీఎస్‌పీఎస్సీ బోర్డు సభ్యులందరూ రాజీనామా చేయాలని అన్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే ఈ ఘటనపై సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
ఇదిలా ఉంటే.. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) ప్రశ్నపత్రాల లీక్ వ్యవహారానికి సంబంధించి ఇప్పటికే అసిస్టెంట్ ఇంజినీర్ (ఏఈ) పరీక్షను రద్దు చేయగా.. శుక్రవారం రోజున గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఏఈఈ), డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ (డీఏవో) పరీక్షలను రద్దు చేస్తున్నట్టుగా బోర్డు ప్రకటించింది. ప్రశ్నపత్రాల లీక్ వ్యవహారం దర్యాప్తు చేస్తున్న సిట్ బృందం నివేదికతో తమ అంతర్గత విచారణలో వెల్లడైన అంశాల ఆధారంగా టీఎస్‌పీఎస్సీ ఈ నిర్ణయం తీసుకుంది.