ఏడేళ్ల పాలనలో సీఎం కేసీఆర్.. దళితులకు సర్వద్రోహాలు చేశారు: బీజేపీ నేత విజయశాంతి ఫైర్

By telugu teamFirst Published Aug 28, 2021, 1:12 PM IST
Highlights

బీజేపీ నాయకురాలు విజయశాంతి సీఎం కేసీఆర్‌పై నిప్పులు చెరిగారు. తన ఏడేళ్ల పాలనలో కేసీఆర్ దళితులకు సర్వద్రోహాలు చేశారని మండిపడ్డారు. దళిత ముఖ్యమంత్రి పోస్టును లాక్కున్నారని, ఇద్దరు దళిత ఉపముఖ్యమంత్రులను అవమానకరంగా వెళ్లగొట్టారని విమర్శించారు. ఇప్పుడు తన చివరి రక్తపుబొట్టు వరకు దళితులకు సేవ చేస్తారని ప్రకటించారని, దీనికన్నా హాస్యాస్పదమైన విషయం మరొకటి ఉండదని ఎద్దేవా చేశారు.
 

హైదరాబాద్: ఏడేళ్ల పరిపానలలో దొరముఖ్యమంత్రి దళితులకు సర్వద్రోహాలు చేశారని బీజేపీ నాయుకురాలు ఫైర్ అయ్యారు. కేసీఆర్ అబద్దాలు చెప్పడం మానుకోవాలని సూచించారు. ప్రజలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. సీఎం కేసీఆర్ దళితుల కోసం చివరి రక్తపుబొట్ట వరకు సేవ చేస్తారన్న ప్రకటన కన్నా హాస్యాస్పదమైన విషయం మరోటి లేదని విమర్శలు చేశారు. దళిత ముఖ్యమంత్రి పదవి గుంజుకున్నారని కేసీఆర్‌పై మండిపడ్డారు. అంతేకాదు, దళిత డిప్యూటీ సీఎంలను అవమానకరంగా వెళ్లగొట్టారని గుర్తుచేశారు.

ట్విట్టర్ వేదికగా రాములమ్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై నిప్పులు చెరిగారు. హుజురాబాద్ ఎన్నిక కోసమే ఆయన అనేక అబద్ధాలు మాట్లాడుతున్నారని ఆరోపించారు. ఎన్నిక భయంతోనే అసత్యాలు పలుకుతున్నారన్నారు. డబుల్ బెడ్ రూం ఇళ్లు ఎగ్గొట్టారని, నిరుద్యోగ భృతికి సున్నా చుట్టారని విమర్శించారు. ఏడేళ్ల కాల పరిపాలనలో దళితుల పట్ల సర్వద్రోహాలకు పాల్పడ్డారని, ఇప్పుడు హుజురాబాద్ భయంతో అనేక అసత్యాలు మాట్లాడుతున్నారని ట్వీట్ చేశారు.

చావు నోట్ల తలబెట్టి తెలంగాణ తెచ్చిన అనే అబద్ధం ఇక చెప్పకపోవడం ఉత్తమమని సూచించారు. ప్రజలు నవ్వుకుంటారని ఎద్దేవా చేశారు. 2009లో ఖమ్మం హాస్పిటల్, నిమ్స్‌లలో ఆయన దొంగ దీక్ష నడిచిందని తెలిపారు. 2014లో తెలంగాణ ప్రజా ఉద్యమాలతోనే వచ్చిందని స్పష్టం చేశారు.

ఆనాడు హాస్పిటళ్లలో కేసీఆర్ తీసుకున్న ఆహార జ్యూస్‌లు, ఓయూ విద్యార్థి సంఘాల హెచ్చరికలు, ఐవీ ఫ్లూయిడ్‌లు, దీక్ష విరమణ కోసం ప్రభుత్వాన్ని బ్రతిమిలాడుకున్న అంశాలన్ని తెలంగాణ ప్రజలు ఇంకా యాదిమరవలేదని పేర్కొన్నారు.

click me!