దుబ్బాక బై పోల్: పాత వీడియో చక్కర్లు... టీఆర్ఎస్‌లో కలకలం, బీజేపీ నేత అరెస్ట్

By Siva KodatiFirst Published Oct 18, 2020, 8:31 PM IST
Highlights

పాత వీడియోలతో దుష్ప్రచారం చేస్తోన్న బీజేపీ నాయకుడు కటకటాల పాలయ్యాడు. మెదక్ జిల్లా దర్పల్లి మండల బీజేపీ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ నాయక్‌ను ఆదివారం పోలీసులు అరెస్ట్ చేశారు.

పాత వీడియోలతో దుష్ప్రచారం చేస్తోన్న బీజేపీ నాయకుడు కటకటాల పాలయ్యాడు. మెదక్ జిల్లా దర్పల్లి మండల బీజేపీ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ నాయక్‌ను ఆదివారం పోలీసులు అరెస్ట్ చేశారు. టీఆర్ఎస్ జెండా దిమ్మలను సొంత పార్టీ నేతలే కూల్చుకుంటున్నారని పాత వీడియోలతో ప్రచారం చేసినట్లు ఆయనపై ఆరోపణలున్నాయి.

ఇటీవలే తన ఫేస్‌బుక్ ఖాతాలో ఈ వీడియోలను నాయక్‌ అప్‌లోడ్ చేసి తప్పుడు ప్రచారం చేస్తున్నాడని విమర్శించారు టీఆర్ఎస్ నేతలు. ఈ మేరకు దుబ్బాక ఎన్నికల రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరిపిన ఈసీ.. 2019లో జరిగిన సంఘటన ఇప్పుడు జరిగినట్లుగా ప్రచారం చేసినట్లు తేలింది.

అలాగే మొబైల్ ఫోన్‌లో తాను పంపిన పాత వీడియో క్లిప్‌లతో పాటు కామెంట్లను శ్రీనివాస్ కొందరికి చూపించినట్లు నిర్థారణ అయ్యింది. అరెస్ట్ అనంతరం శ్రీనివాస్‌ను దుబ్బాక కోర్టులో హాజరుపరిచారు.

అలాగే సోషల్ మీడియా గ్రూపుల్లో రాజకీయ పార్టీలను, నాయకులను, కించపరిచే విధంగా పోస్టులు పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎన్నికల సంఘం హెచ్చరించింది.

ఇటు కేవలం రాజకీయ లబ్ధి కోసం బీజేపీ ఇటువంటి బురద జల్లే కార్యక్రమాలు చేస్తూ దిగజారుతోందని మండిపడింది టీఆర్ఎస్. సంక్షేమ కార్యక్రమాలతో అంతకంతకూ ప్రజల్లో అభిమానాన్ని పెంచుకుంటున్న అధికార పార్టీని ఏదో విధంగా భ్రష్టు పట్టించాలని బీజేపీ చూస్తోందని టీఆర్ఎస్ నేతలు ఫైరవుతున్నారు.

పాత వీడియోలను ఇప్పుడు అప్‌లోడ్ చేసి విష ప్రచారం చేయడం వెనుక పెద్ద కుట్రే వుందని టీఆర్ఎస్ ఆరోపిస్తోంది. 2018లో ఎక్కడో జరిగిన ఒక సంఘటనకు సంబంధించి పాత వీడియోకు ఒక కామెంట్‌ను పెట్టి స్థానికంగా గొడవలు రేకెత్తించేందుకు కుట్ర పన్నారని అంటున్నారు, అలాగే ఈ సంఘటన వెనుక రాష్ట్ర బీజేపీ నేతల హస్తం వుందని కూడా ఆరోపిస్తోంది అధికార టీఆర్ఎస్. 

click me!