జీహెచ్ఎంసీ లో బీజేపీ కార్పోరేటర్లు ఇవాళ తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తో భేటీ అయ్యారు.
హైదరాబాద్: జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం ఏర్పాటుపై బీజేపీ కార్పోరేటర్లు మంగళవారంనాడు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కు వినతిపత్రం సమర్పించారు. ఇటీవల జరిగిన జీహెచ్ఎంసీ సమావేశం అర్ధాంతరంగా వాయిదా పడడంపై బీజేపీ కార్పోరేటర్లు అసంతృప్తిని వ్యక్తం చేశారు. వెంటనే జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని బీజేపీ కార్పోరేటర్లు గవర్నర్ కు సమర్పించిన వినతిపత్రంలో కోరారు. జీహెచ్ఎంసీ సమావేశంలో చోటు చేసుకున్న పరిణామాలను బీజేపీ కార్పోరేటర్లు గవర్నర్ కు వివరించారు.
ఈ నెల 3వ తేదీన జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం జరిగింది.ఈ సమావేశం అర్ధాంతరంగా వాయిదా పడింది. ఈ సమావేశానికి బీజేపీ కార్పోరేటర్లు వినూత్న వేషధారణతో హాజరయ్యారు. సమావేశంలో అధికారులపై బీజేపీ కార్పోరేటర్లు అనుచిత వ్యాఖ్యలు చేశారని జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి ఆరోపించారు. బీజేపీ కార్పోరేటర్లు వ్యవహరించిన తీరుపై అధికారులు అసంతృప్తిని వ్యక్తం చేశారు. జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశాన్ని జలమండలి అధికారులు, జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్లు బహిష్కరించారు. దీంతో సమావేశం అర్ధాంతరంగా వాయిదా పడింది. జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం వాయిదా పడిన తర్వాత కూడా కార్యాలయం ముందు బీజేపీ, కాంగ్రెస్ కార్పోరేటర్లు ఆందోళనకు దిగారు.
also read:జీహెచ్ఎంసీ సమావేశం వాయిదా: బీజేపీ, కాంగ్రెస్ కార్పోరేటర్ల నిరసన
జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో ప్రజా సమస్యలు చర్చకు వస్తాయని భయపడి సమావేశం జరగకుండా అధికార బీఆర్ఎస్ అడ్డుపడిందని బీజేపీ కార్పోరేటర్లు ఆరోపించారు. హైద్రాబాద్ నగర వాసుల సమస్యలను చర్చించి వాటికి పరిష్కారం చూపేందుకు జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశాన్నినిర్వహించేలా చర్యలు తీసుకోవాలని బీజేపీ కార్పోరేటర్లు గవర్నర్ ను కోరారు.