మునుగోడు బై‌ పోల్‌: ఈ నెల 31 నిర్వహించ తలపెట్టిన సభను రద్దు చేసుకున్న బీజేపీ.. కారణం ఇదేనా..?

By Sumanth Kanukula  |  First Published Oct 29, 2022, 9:21 AM IST

మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో ఈ నెల 31న నియోజకవర్గంలో బీజేపీ భారీ బహిరంగ సభ నిర్వహించాలని ప్రణాళికలు రచించింది. అయితే ఆ సభను రద్దు చేసుకున్నట్టుగా బీజేపీ తెలిపింది. 
 


మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో ఈ నెల 31న నియోజకవర్గంలో బీజేపీ భారీ బహిరంగ సభ నిర్వహించాలని ప్రణాళికలు రచించింది. ఈ సభకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరుకానున్నారని ఆ పార్టీ రాష్ట్ర నాయకులు తెలిపారు. అయితే తాజాగా ఈ నెల 31న తలపెట్టిన మునుగోడు ఉప ఎన్నిక ప్రచార సభను రద్దు చేస్తున్నట్టుగా బీజేపీ ప్రకటించింది. అయితే అక్టోబర్ 31న మునుగోడు నియోజకవర్గంలో మండల స్థాయి సమావేశాలను నిర్వహించనున్నట్టుగా బీజేపీ తెలిపింది. ఈ సభలకు బీజేపీ ముఖ్య నాయకులు హాజరయ్యే అవకాశం ఉంది. 

‘‘సభకు అనుమతి కోసం పోలీసులను సంప్రదించాం. ప్రచారం చివరి రోజు అనేక ర్యాలీలు వరుసలో ఉన్నందున బహిరంగ సభ సాధ్యం కాదని వారు చెప్పారు’’ బీజేపీ నేత, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి తెలిపారు. అక్టోబరు 31న పార్టీ మండల స్థాయి సమావేశాలు నిర్వహిస్తామని చెప్పారు.

Latest Videos

అయితే ప్రస్తుతం తెలంగాణలో నలుగురు టీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేశారనే అంశం హాట్‌ టాపిక్‌గా మారింది. రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ కుట్ర పన్నిందని టీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు. అయితే ఆ ఘటనతో బీజేపీకి ఎలాంటి సంబంధం లేదని బీజేపీ చెబుతుంది. ఫామ్‌హౌస్ ఘటన కేసీఆర్ ఆడిస్తున్న డ్రామా అని బీజేపీ ఆరోపిస్తుంది. రాష్ట్రంలో  నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలోనే నడ్డా పాల్గొనేలా ప్లాన్ చేసిన సభను బీజేపీ రద్దు చేసుకుందనే ప్రచారం సాగుతుంది. 

ఇక, అక్టోబర్ 31న మునుగోడ నియోజకవర్గంలో మండలాల వారీగా నిర్వహించాలని చూస్తుంది. ఒక్కో సభకు ఒక్కో రాష్ట్ర, జాతీయ స్థాయి ముఖ్య నేతను గెస్టుగా పిలవాలని ప్లాన్ చేసింది. ఈ సభలకు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ, అస్సోం సీఎం హేమంత బిశ్వ శర్మ, ఎంపీ తేజస్వీ సూర్య‌లతో పాటు పలువురు ముఖ్య నేతలను రప్పించాలని బీజేపీ రాష్ట్ర నాయకత్వం ప్రయత్నాలు చేస్తోంది. అయితే మండలాల వారీగా జరిగే సభల్లో పాల్గొనే నేతలకు సంబంధించిన వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్టుగా బీజేపీ వర్గాలు తెలిపాయి.  ఈ సభలకు మండలాల వారీగా 25 వేల మందితో జనసమీకరణ చేయాలని  బీజేపీ నేతలు భావిస్తున్నారు.  

click me!