
Telangana: కేంద్రంలోని బీజేపీ సర్కారు ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా టీఆర్ఎస్ పార్టీ పోరాడుతోందని తెలంగాణ రాష్ట్ర మహిళా శిశు, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని బీజేపీ సర్కారు.. ప్రతీకార రాజకీయాలకు పాల్పడుతోందని ఆమె ఆరోపించారు. ప్రజా, రైతు, కూలీల వ్యతిరేక విధానాలపై ఇక్కడి టీఆర్‌ఎస్ ప్రభుత్వం పోరాడుతున్నదని తెలిపారు. తెలంగాణకు నష్టం కలిగించేలా బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధికి సాయం అందించకుండా.. రాష్ట్రానికి న్యాయంగా అందాల్సిన వాటిని కూడా ఇవ్వకుండా తెలంగాణపై వివక్ష చూపుతున్నదని విమర్శించారు.
ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర బీజేపీ సర్కారు నేతలతో పాటు.. రాష్ట్ర బీజేపీ నాయకులు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. యాసంగి సీజన్‌లో మొత్తం వరిధాన్యాన్ని కొనుగోలు చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ నుంచి వరి కొనుగోలుపై కేంద్రం ప్రకటన చేసే వరకు బీజేపీ ప్రభుత్వం ముందు టీఆర్ఎస్ పార్టీ తల వంచబోదని ఆమె హెచ్చరించారు. కేంద్ర నిర్ణయం మార్చుకునే వరకు తమ పోరాటం సాగుతుందని తెలిపారు. ప్రజల కోసం తాము ఈ విధంగా ముందుకు సాగుతున్నామని తెలిపారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కెటి రామారావు (కేటీఆర్) పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా టీఆర్ఎస్ శ్రేణులు నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. దీనిలో భాగంవగా మంత్రి సత్యవతి రాథోడ్‌తో పాటు ఎంపీ మాలోత్ కవిత, ఎమ్మెల్యే రెడ్యానాయక్, ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్‌రావు, జెడ్పీ చైర్‌పర్సన్ ఏ బిందు, మహబూబాబాద్ మున్సిపల్ చైర్మన్ రామ్మోహన్‌రెడ్డి తదితరులు బహబూబాబాద్ లో నిర్వహించిన నిరసనల్లో పాల్గొన్నారు.
అలాగే, ఎమ్మెల్యే శంకర్‌నాయక్, టీఆర్‌ఎస్ నాయకుడు నూకల రంగారెడ్డి తదితరులు నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. హన్మకొండ, వరంగల్, జనగాంలలో జరిగిన నిరసన కార్యక్రమాల్లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా పాల్గొని తెలంగాణలో ఈ యాసంగి సీజన్‌లో పండించిన వరిని కేంద్రమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రైతన్నల కోసం కేంద్రంపై ఈ పోరాటం కొనసాగుతుందని తెలిపారు. హన్మకొండలోని బాలసముద్రంలోని కుడా మైదానంలో ప్రభుత్వ చీఫ్‌విప్, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్ ఆధ్వర్యంలో భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. రైతుల సంక్షేమాన్ని బీజేపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ప్రజా వ్యతిరేక విధానాలతో కేంద్ర బీజేపీ ముందుకు సాగుతూ.. ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నదని విమర్శించారు. వరి ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 4వ తేదీ నుండి 11వ తేదీ వరకు ఆందోళన కార్యక్రమాలను నిర్వహించనున్నట్టుగా టీఆర్ఎస్ ప్రకటించింది. ఇప్పటికే మండల కార్యాలయాల్లో నిరసన దీక్షలను షురు చేసింది. దీనిలో భాగంగానే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలను టీఆర్ఎస్ శ్రేణులు నిర్వహిస్తున్నాయి.
ఇదిలావుండగా, మంత్రి కేటీఆర్ సిరిసిల్లాలో జరిగిన నిరసనల్లో పాల్గొన్నారు. కేంద్ర బీజేపీ సర్కారుపై విమర్శలతో విరుచుకుపడ్డారు.